ఆఫీసులో నిద్ర.. ఉద్యోగులకు మంచిదే!
ఆఫీసుకు వెళ్లేది పనిచేయడానికా.. నిద్రపోడానికా అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ఉద్యోగుల మీద జోకులు వేసుకోవడం మనకు తెలుసు. కానీ, వాస్తవానికి ఉద్యోగులు ఆఫీసు సమయాల్లో కాసేపు అలా చిన్న కునుకు వేయడానికి అనుమతించాలట. అలా చేయడం వల్ల వాళ్ల ఉత్పాదకత పెరుగుతుందని, దాంతో కంపెనీకి ఆదాయం కూడా పెరుగుతుందని తాజాగా చేసిన ఓ పరిశోధనలో తేలింది. ఉద్యోగులలో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు, సహనాన్ని పెంచడానికి, పనిలో చికాకులు తగ్గించడానికి ఈ చిన్న పాటి కునుకు ఉపయోగపడుతుందని మిచిగన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఎక్కువ సేపు మెలకువగా ఉండి ఉద్యోగాలు చేయాల్సిన వాళ్లకు ఇలాంటి కునుకులు బాగా ఉపయోగపడతాయని పరిశోధనలో పాల్గొన్న జెన్నిఫర్ గోల్డ్ష్మీడ్ తెలిపారు. సాధారణంగా ఎవరైనా పడుకుంటే యజమానులకు కోపం వస్తుంది గానీ, అలా పడుకోనిస్తే.. ఆ తర్వాత వాళ్లు చాలా అద్భుతంగా పనిచేయగలరని చెప్పారు. ఇందుకోసం.. వాళ్లకు అవసరమైతే బ్రేక్ సమయాన్ని కొంత పెంచి.. చిన్న కునుకు తీయడానికి దిండ్లు కూడా సమకూర్చాలన్నారు. ఇందుకోసం 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 40 మంది ఉద్యోగుల మీద పరిశోధన చేశారు. వాళ్లలో కొంతమందిని పడుకోనిచ్చారు, మరికొందరిని మాత్రం పడుకోనివ్వకుండా పనిచేయించారు. కాసేపు పడుకున్న వాళ్లు బాగా పనిచేశారని, నిద్ర లేని వాళ్లు మాత్రం పనితీరు అంతంతమాత్రంగానే కనబరిచారని పరిశోధకులు వివరించారు.