పల్మునాలజీ కౌన్సెలింగ్
టీబీ శాశ్వతంగా నయం అవుతుంది
మా అమ్మ వయసు 55 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతూ రక్తహీతన (అనీమియా)కు గురైంది. ఇటీవలే పరీక్షలు చేయిస్తే ఆమెకు టీబీ ఉన్నట్లు తెలిసింది. టీబీ శాశ్వతంగా నయమవుతుందా? అలా నయమవ్వాలంటే ఏం చేయాలి? దయచేసి వివరించండి.
- మహాలక్ష్మి, కంబం
సరైన రీతిలో చికిత్స తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా, శాశ్వతంగా నయమవుతుంది. ఇది మైక్రో బ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల సంక్రమించే వ్యాధి. జ్వరం, తెమడ పడుతూ దగ్గురావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీకి ఐసోనియాజిడ్, రిఫామ్పిసిన్, పైరజినమైడ్, ఎథాంబుటాల్ అనే నాలుగు రకాల మందులను కాంబినేషన్స్‌లో ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ మందుల మోతాదును రోగి బరువును పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పూర్తి చికిత్స కోసం కనీసం ఆర్నెల్లు మందులు వాడాల్సి ఉంటుంది. మొదటి రెండు నెలలను ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు. ఇందులో నాలుగు రకాల మందులనూ ఉపయోగిస్తారు. చివరి నాలుగు నెలలనూ కంటిన్యూయేషన్ ఫేజ్ అంటారు. ఇందులో కేవలం ఐసోనియజిడ్, రిఫామ్పిసిన్ మందులను మాత్రమే వాడతారు. టీబీ చికిత్సలో రోగి ఓపికగా పూర్తికాలం పాటు మందులు వాడి తీరాలి. కొన్నాళ్ల తర్వాత లక్షణాలు తగ్గినట్లు కనపడగానే, తనకు వ్యాధి నయమైనట్లుగా భావించి, మందులను వదిలేస్తే వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే రోగి మందులు వాడుతూ క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. చికిత్స సమయంలో రోగి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామందిలో ఆకలి తగ్గడం, తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగులు బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్ల వంటివి తీసుకోవడం వల్ల రోగులు మెరుగ్గా కోలుకుంటారు. డయబెటిస్ వ్యాధి కూడా టీబీతో బాధపడే రోగులను ప్రభావితం చేసే అంశమవుతుంది. ఎందుకంటే చక్కెరను సక్రమంగా అదుపులో పెట్టుకోని రోగుల్లో వ్యాధి నయం కావడం అంత తేలిక కాదు. ఇక చివరగా టీబీ వచ్చిన రోగులకు తప్పనిసరిగా హెచ్ఐబీ స్క్రీనింగ్ పరీక్ష చేయించాలి. ఎందుకంటే వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల చాలామందిలో టీబీ బయటపడుతుంది. వ్యాధి నిరోధకత తగ్గిందంటే అది హెచ్ఐవీ వల్లనా అనేది తెలుసుకొని, ఒకవేళ హెచ్ఐవీని కనుగొంటే దానికి కూడా చికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మగారి రక్తహీనత సమస్యకు వస్తే అది క్రమంగా ట్యాబ్లెట్లతో పరిష్కరించవచ్చు. ఒకవేళ ఆమెకు రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం అవసరం కావచ్చు.
డాక్టర్ ఎం.వి. నాగార్జున
పల్మునాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ,
హైదరాబాద్