సబ్సిడీ ఉపసంహరణ: ఆటో దిగ్గజానికి ఝలక్
న్యూఢిల్లీ : బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు ఇటీవలే కార్ల కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చిన తర్వాత, కేంద్రప్రభుత్వం సైతం మరో ఝలకిచ్చింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ఏఎంఈ) స్కీమ్ కింద తేలికపాటి హైబ్రిడ్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీలను ఉపసంహరిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రోత్సహకాల ఉపసంహరణ దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాపై ఎక్కువగా దెబ్బ కొట్టనుంది. తేలికపాటి హైబ్రిటీ టెక్నాలజీతో రూపొందిన కంపెనీ పాపులర్ మోడల్స్, మల్టి యుటిలిటీ వెహికిల్ ఎర్టిగా, మిడ్ సైజ్డ్ సెడాన్ సియాజ్ లు ఈ స్కీమ్ కింద లబ్ది పొందుతూ వస్తున్నాయి.
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎర్టిగా, సియాజ్ మోడల్స్ ఒక్కో వెహికిల్ పై మారుతీ సుజుకీ రూ.13వేల వరకు లబ్ది పొందుతోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుండటంతో 2015 ఏప్రిల్ లో ఈ స్కీమ్ ను లాంచ్ చేశారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఎఫ్ఏఎంఈ స్కీమ్ కింద తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీలకు ఇస్తున్న ప్రోత్సహకాలను విత్ డ్రా చేసుకుంటున్నట్టు భారీ పరిశ్రమల శాఖ ఓ ప్రకటన జారీచేసింది. మొత్తం హైబ్రిడైజేషన్ గా మారడానికి తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ తొలి అడుగని, ఈ టెక్నాలజీతో వాహనాలు అందించడాన్ని కొనసాగిస్తామని, ప్రోత్సహకాల ఉపసంహరణ కంపెనీపై ప్రభావం పడుతుందని తాము భావించడం లేదని మారుతీ సుజుకీ అధికార ప్రతినిధి చెప్పారు.