Mime shows
-
భాష లేనిది.. నవ్వించే నిధి
సాక్షి, సిటీబ్యూరో: పిల్లల కోసం రూపొందించిన అంతర్జాతీయ నాటకాలు నగరంలో ప్రారంభమయ్యాయి. రంగ శంకర బెంగళూరు వారి ఆధ్వర్యంలో వీటిని ప్రదర్శిస్తున్నారు. గత రెండేళ్లుగా అహ్మదాబాద్‌లో జరుపుతున్న నాటకోత్సవాలను ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాటకాలకు నగర బాలలకు పరిచయం చేయడం అభినందించదగిన విషయమంటున్నారు తమ పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు. మాటలు లేని, అభినయ ప్రధానమైన మైమ్ నాటకాలు కావటంతో మరింత ఆసక్తిగా ఉన్నాయంటున్నారు చిన్నారులు. జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో కూడిన ఈ నాటకోత్సవాలు ఈ నెల 19 వరకు సప్తపర్ణిలో ప్రదర్శించనున్నారు. జర్మనీ, యూకే, అమెరికా, పెరూ, స్విట్జర్లాండ్, ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చిన కళాకారులు నాటకాలను ప్రదర్శిస్తున్నారు. నాటక ప్రదర్శనల వివరాలు ఇలా ఉన్నాయి. 15న మై షో అండ్ మీ (యూకే), 16న గుల్లివర్ (ఢిల్లీ), 17న బాడీ రాప్సోడీ (పెరూ), 18న కార్నివాల్ ఆఫ్ ట్రాన్స్ఫిగరో (స్విట్జర్లాండ్), 19న సర్కిల్ ఆఫ్ లైఫ్ (బెంగళూరు). సప్తపర్ణి, రోడ్ నెం.8 బంజారాహిల్స్‌లో వీటిని ఉదయం 11గంటలకు, రాత్రి 7.30 గంటలకుప్రదర్శిస్తారు. -
స్టోరీ టెల్లర్స్
‘విజయవంతమైన వారు ఈ ప్రపంచానికి అక్కర్లేదు. కావల్సిందల్లా... శాంతికాముకులు, కథకులు, అన్నింటినీ ప్రేమించేవారు మాత్రమే’ అని చెప్పిన దలైలామా మాటలను నిజం చేస్తూ, సమాజ శ్రేయస్సును కోరుకునే కొందరు కథలు చెప్పడాన్నే తమ వృత్తిగా మార్చుకున్నారు. పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు, వారి భవితవ్యాన్ని సృజనాత్మకంగా మలచేందుకు కథలనే సాధనంగా మలచుకున్నారు. పిల్లలకు నచ్చేలా కథలకు రకరకాల అభినయాలను, పాటలను జోడించి, వాటికి కొత్త అర్థం కల్పిస్తున్నారు ఈ కథకులు. ఇలాంటి కథలు ఆదివారాల్లో సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో వినొచ్చు... ఆటపాటలతో... ఆట పాటలంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. అందుకే దీపాకిరణ్ ఆటపాటలతో కలిపి కథలు చెబుతారు. ఈ కథల ద్వారా చిన్నారులకు ఎన్నెన్నో విషయాలను ఆసక్తికరంగా బోధిస్తారామె. ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎమ్మే చేసిన దీపాకిరణ్ కథలు చెప్పడాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లో స్టోరీ ఆర్ట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మాటలతో పనిలేదు... వరంగల్‌కు చెందిన మధు ‘మైమ్ మధు’గా ప్రసిద్ధుడు. అంతర్జాతీయంగా ఎన్నెన్నో మైమ్ ప్రదర్శనలు ఇచ్చిన మధు, పిల్లలకు ఈ కళను నేర్పించడంపై ఎంతో ఆసక్తి చూపుతారు. ఆంగిక, అభినయాల ద్వారా భావ వ్యక్తీకరణ చేయగల మైమ్ ద్వారా నవరసాలు పలికించవచ్చని, దీని ద్వారా పిల్లలతోనే కథలు చెప్పించవచ్చని అంటారాయన. దీని ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత ద్విగుణీకృతమవుతుందని కూడా ఆయన చెబుతారు. తేట తెలుగులో... ఆంత్రొపాలజీ, బయాలజీల్లో మాస్టర్స్ డిగ్రీలు చేసిన ఉమాగాయత్రి చల్లా, మాతృభాషాభిమానంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాతృభాషలో పిల్లలకు కథలు, పాటలు నేర్పేందుకు పది పుస్తకాలు ప్రచురించి, అందుబాటులోకి తెచ్చారు. చాలామంది పేరెంట్స్‌కు పిల్లలకు కథలు చెప్పడం రావడం లేదని గమనించి, పిల్లల కోసం కథా కాలక్షేపం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకు ఆమె సందేశాత్మక కథలు చెబుతున్నారు. పిల్లలకు సామాజిక, వ్యక్తిగత బాధ్యతలు నేర్పేందుకు కథలే తగిన సాధనమని చెబుతారామె. - ఓ మధు