మినీ హైడల్ విద్యుత్ ఉత్పత్తి
పెద్దపల్లి : జలవిద్యుత్ కేంద్రాలు మూడేళ్ల తరువాత ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ఎస్సారెస్పీలో నీళ్లు లేక మూడేళ్లు మూతపడిన మినీ హైడల్ కేంద్రాల్లో మరో మూడు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 25 క్రితం పెద్దపల్లి డివిజన్లో కమ్మరిఖాన్‌పేట, కుమ్మరికుంట, కాచాపూర్, చందపల్లి వరకు 10 చోట్ల ఏర్పాటు చేసిన జలవిద్యుత్ కేంద్రాలు గంటకు 9.16 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ 10 కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను సుగ్లాంపల్లి స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి ఇతర సబ్స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల తవ్వకం పూర్తిఅయిన తరువాత పెద్దపల్లి డివిజన్‌లోనే మినీ జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరుసగా 2004 వరకు ఏటా వర్షాకాలంలో నాలుగు నెలలు విద్యుత్ ఉత్పత్తి కొనసాగేది. 2004 తర్వాత వర్షాభావ పరిస్థితులతో ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గిపోవడంతో అప్పుడప్పుడు ఆరుతడి పంటల కోసం నీరు విడుదల చేశారు. కొద్దిపాటి నీటితో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో ఉత్పత్తి సాగలేదు. ఈసారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో కాలువలకు నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పెద్దపల్లి ప్రాంతంలోని డి86, డి83 కాలువలకు నీరు చేరనుంది. దీనికోసం జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగులను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రాంతంలోని మినీ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రైతులకు మరింత మెరుగైన కరెంటు ఇవ్వొచ్చని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. జలవిద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పెద్దపల్లి పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలకు 24 గంటలకు సరిపడే విద్యుత్‌కు సమానం.