ఏటీఎం కేంద్రాల వద్ద మోసం
పలమనేరు, న్యూస్‌లైన్: ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు ఎక్కువవుతున్నాయి. ఖాతాదారులు ఏమాత్రం ఏమారినా టోపీ పెట్టేస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డుల చైన్‌లింక్ సిస్టమ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. ఖాతాల్లోని డబ్బును చాకచక్యంగా డ్రాచేసేస్తున్నారు. మదనపల్లె డివిజన్లోని పలుచోట్ల ఈ తరహా మోసాలు జరుగుతుండడం పోలీసులకు సవాల్‌గా మారింది.
రెండ్రోజుల క్రితం పలమనేరులోని బజారువీధిలో ఓ సెంటర్ వద్ద కృష్ణాపురానికి చెందిన వినాయకం తన ఖాతాలో నిల్వచూసి చెప్పాలని అపరిచిత వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఆ కార్డును ఏటీఎంలో పెట్టి పిన్ నంబర్ చెప్పమని మినీ స్టేట్మెంట్ తీసి చేతికిచ్చాడు. అతని చేతిలో మరో ఏటీఎం కార్డు పెట్టాడు. రెండ్రోజుల్లో అగంతకుడు రూ.80వేలు డ్రా చేసేశాడు. అదే విధంగా గంగవరం మండలం కే.మిట్టూరుకు చెందిన జానకమ్మ నాలుగు నెలల క్రితం పలమనేరులో ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. డబ్బు ఎంతుందో చూసి చెప్పాలని ఓ వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చింది.
నెంబర్ అడిగి తెలుసుకుని ఆ ఖాతాలో డబ్బులేదని చెప్పాడు. అతని వద్ద ఉన్న మరో కార్డును ఆమెకు ఇచ్చేశాడు. అప్పుడే కొంతసేపటికి వేరొకరి ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆ కార్డు పనిచేయలేదు. కార్డును పోగొట్టుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి ఆ నంబర్ లాక్ చేయించింది.
అయితే అప్పటికే ఆమె ఖాతాలోని రూ.5200 డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దానిపై ఉన్న చిరునామా మేరకు పుంగనూరుకెళ్లి విచారించారు. వారం రోజుల క్రితం తన బావమరిదికి ఇచ్చి కోడ్ నంబర్‌ను చెప్పి పుంగనూరుకు పంపానని, అతని వద్ద ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసం చేసి రూ.5వేలు డ్రా చే శాడని చెప్పాడు. అతని చేతికొచ్చిన ఏటీఎం కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు విచారించగా, మదనపల్లెలో మరో వ్యక్తి ఇలాగే మోసపోయినట్లు తేలింది. ఈ రకం మోసాలు ఈ ప్రాంతంలో వరుసగా జరుగుతూనేన్నాయి.
ఎస్ఎంఎస్ అలర్ట్‌తో మోసాలకు చెక్.....
బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్‌తో కొంత వరకు మోసాలకు చెక్‌పెట్టవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సీక్రెట్ కోడ్‌ను ఎవరికీ చెప్పరాదు. ఏటీఎంలో డబ్బులు మోసపోయినపుడు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 1800112211, 18004253800, 08026599990కు సమాచారమిస్తే ఆ కార్డును లాక్ చేస్తారు. బ్యాంకుల్లో గ్రీన్ చానెల్ కౌంటర్లను పెట్టాం. ఆపరేషన్ తెలియని వారెవరైనా బ్యాంకు వెళితే నిమిషాల వ్యవధిలో డబ్బు డ్రా చేసుకోవచ్చు.
-వేణుగోపాల రావ్, బ్రాంచ్ చీఫ్ మేనేజర్, ఎస్బిఐ పలమనేరు