కేజీహెచ్‌లో మాస్టర్ ప్లాన్
అమలుకు 20న హైదరాబాదులో సమావేశం
ఆస్పత్రిలో మంత్రి కామినేని బస వైద్య సేవలపై ఆరా
విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో మాస్టర్ ప్లాన్ అమలుకు ఆంధ్రప్రదేశ్వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) అధికారులతో ఈనెల 20న హైదరాబాదులో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలిసి కేజీహెచ్ మెన్స్ స్పెషాలిటీ వార్డులో శుక్రవారం రాత్రి బస చేసిన మంత్రి శనివారం ఉదయం కేజీహెచ్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అత్యవసర వైద్య విభాగంతోపాటు ప్రసూతి వార్డు, సూపర్‌స్పెషాలిటీ వార్డుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సూపర్ స్పెషాలిటీ వార్డులో నిర్మాణంలో ఉన్న భవనం పనులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు, సదుపాయాల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పనిచేయని నాలుగు లిఫ్ట్‌లను వెంటనే బాగుచేయాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
దీనికి రూ.1.33కోట్లు అవసరమని ఆ సంస్థ ఈఈ ఉమేష్ కుమార్ మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో ఎన్టీయార్ వైద్య పథకం (ఆరోగ్యశ్రీ) ద్వారా వచ్చే ఆదాయాన్ని 50శాతం పెంచుకోవాలని మంత్రి వైద్యులకు సూచించారు. ఆయనను నర్సింగ్ విద్యార్థులు కలిసి ఉపకార వేతనాల బకాలయిలను చెల్లించాలని కోరారు. దీనిని పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య విద్యార్థులు, ప్రభుత్వ వైద్యులకోసం ఆస్పత్రి ఆవరణలోనే అల్పాహార క్యాంటీన్లు నిర్మించేందుకు ఆయన హామీ ఇచ్చారు. నర్సుల సంఘంనాయకులు, ప్రభుత్వ వైద్యుల సంఘంనేతలు మంత్రికి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌బాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ పి.వి.సుధాకర్, ఆర్ఎంవోలు డాక్టర్ శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు.