Minister Etela
-
ధరలు పెరిగిన మాట వాస్తవమే- మంత్రి ఈటల
హైదరాబాద్ : వర్షాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగిన మాట వాస్తవమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడారు. కొన్నిచోట్ల పప్పుల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని, బ్లాక్ మార్కెట్ అయిన పప్పులను వెనక్కి తెస్తున్నామని తెలిపారు. త్వరలోనే కందిపప్పు ధరను రూ.110 నుంచి రూ.120 వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. కొన్ని నిత్యావసర ధరల నియంత్రణ ప్రభుత్వ అదుపులో ఉండటం లేదని, అయినప్పటికీ ప్రభుత్వమే కొన్ని వస్తువులను సబ్సిడీపై సరఫరా చేస్తోందని తెలిపారు. ఇతర శాఖల సమన్వయంతో ధరలను నియంత్రిస్తామని అన్నారు. -
'ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని దేశంలో నంబర్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ దిశలోనే ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని నిర్వహించనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, పార్టీ నాయకుడు సుభాష్‌రెడ్డిలతో కలసి ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేసేలా ప్లీనరీ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలమంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించామని, ఆహ్వానాలు అందినవారు మాత్రమే ప్రతినిధుల సభకు హాజరు కావాలని ఈటల సూచించారు. వివిధ అంశాలపై ఈ ప్లీనరీలో చర్చ జరిపి కొత్త ఒరవడికి నాంది పలుకుతామని తెలిపారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. వచ్చే ఏడాది జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. -
'మాది చేతల ప్రభుత్వం'
- ప్రాధాన్యత క్రమంలో హామీలు నెరవేరుస్తున్నాం - చక్కెర ఫ్యాక్టరీలను చక్కబెడుతాం - ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మెట్పల్లి రూరల్ (కరీంనగర్ జిల్లా) : టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాదని... చెప్పింది చేసి చూపుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వద్ద రూ.1,300 కోట్లతో చేపట్టనున్న మిషన్ భగీరథ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. గోధూర్ నుంచి నిజామాబాద్ జిల్లా బట్టాపూర్ వరకు రూ.10 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టనున్న రోడ్ల వెడల్పు పనులను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతున్నామని చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే డబ్బా రిజర్వాయర్ కోసం రూ.340 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించారని, కానీ, నాటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.34 కోట్లను చెల్లించలేదన్నారు. ఆనాటి కల నేడు నెరవేర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో రాష్ట్రమంతటికి మంచినీటిని అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్డీఎస్ఎల్ చక్కెర ఫ్యాక్టరీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాల నియామాకాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఉద్యోగులకు జీత, భత్యాలను పెంచిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ఉండికూడా తగినంత భూమిని సాగు చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల నుంచి ఆగమైన పరిపాలనను తమ ప్రభుత్వం చక్కబెడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.