'మాది చేతల ప్రభుత్వం' | Finance Minister Etela Rajender visits Ibrahimpatna | Sakshi
Sakshi News home page

'మాది చేతల ప్రభుత్వం'

Published Fri, Mar 25 2016 7:53 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

Finance Minister Etela Rajender visits Ibrahimpatna

- ప్రాధాన్యత క్రమంలో హామీలు నెరవేరుస్తున్నాం
- చక్కెర ఫ్యాక్టరీలను చక్కబెడుతాం
- ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్


మెట్‌పల్లి రూరల్ (కరీంనగర్ జిల్లా) : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాదని... చెప్పింది చేసి చూపుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వద్ద రూ.1,300 కోట్లతో చేపట్టనున్న మిషన్ భగీరథ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. గోధూర్ నుంచి నిజామాబాద్ జిల్లా బట్టాపూర్ వరకు రూ.10 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టనున్న రోడ్ల వెడల్పు పనులను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతున్నామని చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే డబ్బా రిజర్వాయర్ కోసం రూ.340 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించారని, కానీ, నాటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.34 కోట్లను చెల్లించలేదన్నారు.

ఆనాటి కల నేడు నెరవేర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో రాష్ట్రమంతటికి మంచినీటిని అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర ఫ్యాక్టరీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాల నియామాకాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఉద్యోగులకు జీత, భత్యాలను పెంచిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ఉండికూడా తగినంత భూమిని సాగు చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల నుంచి ఆగమైన పరిపాలనను తమ ప్రభుత్వం చక్కబెడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement