టీడీపీలో నామినేటెడ్ చిచ్చు
మంత్రుల మధ్య ‘కోల్’్డ వార్
ఆశావహులకు దొరకని అమాత్యులు
పదవుల కోసం చక్కర్లు
కీలక కమిటీల కోసం సిగపట్లు
విశాఖపట్నం: టీడీపీలో నామినేటెడ్ పదవుల చిచ్చు మొదలైంది. ఎడముఖం..పెడముఖంగా ఉన్న జిల్లా మంత్రుల మధ్య ఈ పదవుల పందేరం విషయమై కోల్డ్‌వార్ సాగుతోంది. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామంటూ అధిష్టానం ప్రకటన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ ప్రజాప్రతి నిధుల తీరు తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎన్నికల ముందు పార్టీలోకి వలస వచ్చివారి హవాను, దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తమను ఏ మాత్రంపట్టించు కోవడం లేదంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పదవీకాంక్షతో రాజధానికి క్యూ కడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక మీ ఎమ్మెల్యేల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకుంటేనే మీ పనవుతుందని అధినాయకత్వం తేల్చి చెప్పడంలో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లయినా విశాఖ నగర కమిటీ నియామకం జరగలేదు. నిన్నమొన్నటివరకు వుడా చైర్మన్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నవారంతా.. తానే చైర్మన్‌గా ఉంటానంటూ సీఎం ప్రకటించడంతో నీరుగారిపోతున్నారు.
ప్రసిద్ధి చెందిన కనకమహాలక్ష్మి దేవస్థానంతో పాటు సంపత్వినాయకాలయం, ఆంజనేయ స్వామి, పోలమాంబ, కనకమ్మ,ఉపమాక తదితర దేవాలయాల పాలక వర్గాల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు చిన్నా చితకా కలిపి ఐదారువందలకుపైగా దేవాలయాలున్నాయి. కనక మహాలక్ష్మి పాలకవర్గం పదవికి గిరాకీ ఉంది. ప్రస్తుత ఉత్సవ కమిటీనే పాలకవర్గంగా కొనసాగించేందుకు మంత్రి పావులు కదుపుతున్నారు. భీమి లి, అనకాపల్లి, పెందుర్తి-గోపాలపట్నం, మాడుగుల- చోడవరం, నర్సీపట్నం, పాడేరు-చింతపల్లి, పాయకరావుపేట, యలమంచిలి మార్కెట్ కమిటీల పాలక వర్గాలకు ద్వితీయ, తృతీయశ్రేణి నాయకుల నుంచి గట్టి పోటీ ఉంది. యలమంచిలి మార్కెట్ కమిటీ పదవిని మండలపార్టీ అధ్యక్షుడు ఎన్.రంగనాయకులు ఆశిస్తున్నారు. ఎన్నికలముందు ఈపదవిని రంగనాయకులకు ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆశ చూపారు కూడా. తీరా ఇప్పుడు తన సామాజికవర్గానికి చెందినవారికి ఈ పదవిని కట్టబెట్టేందుకు ఆయనపావులు కదుపుతుండడం పార్టీ సీనియర్లకు మింగుడుపడడం లేదు. భీమిలి కోసం సీనియర్ నేతలు బొమ్మిడిసూర్యనారాయణ, మనోహరనాయుడు, గాడే అప్పల నాయుడు ఆశపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంటా శ్రీనివాస రావు వీరినికాదని తనతో పాటు ఎన్నికల ముందు..ఆ తర్వాత పార్టీలోకివచ్చినవారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులే బాహాటంగా విమర్శిస్తు న్నారు.
మరోపక్క మంత్రులిరువురు కీలక పాలకవర్గాల్లో ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు ఎవరికి వారు జాబితాలను పార్టీ అధినేత ఆమోదం కోసం రాజధానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి పదవుల పందారంలో ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీకోసం పనిచేసిన వారిని కాదని తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెడుతుంటే తాము చూస్తూఊరుకబోమని అల్టిమేటమ్ ఇస్తున్నారు.