మహాత్మా జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శప్రాయమైనదని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
♦ మంత్రి గంటా వెల్లడి
♦ ఘనంగా పూలే జయంతి
అల్లిపురం : మహాత్మా జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శప్రాయమైనదని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీపీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జ్యోతిరావు పూలే 189వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి గంటా, కలెక్టర్ ఎన్.యువరాజు, ఎంపీలు కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్, విష్ణుకుమార్‌రాజు జిల్లా కోర్టు వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సామాజికంగా అణగారిన వర్గాల్లో చైతన్యం కలిగించిన గొప్ప వ్యక్తి పూలే అని చెప్పారు. రాష్ట్రంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు మహానీయుల జీవిత చరిత్రలను సిలబస్‌లో చేర్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, జేసీ జె.నివాస్, ఏజేసీ డి.వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డి ప్యూటీ డెరైక్టర్ నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషర్ ఈడీ జీవన్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.