చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్‌పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం జ్యోతిరావ్‌పూలే జయంతిని పండుగలా జరుపుకోవడం అభినందనీయమన్నారు. బలహీన వర్గాల బాలబాలికలకు విద్య చాలా అవసరమని 1873లోనే గుర్తించి సత్యశోధక సమాజాన్ని నిర్మించిన మహాత్ముడు జ్యోతిరావ్‌పూలే అని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో జ్యోతిరావ్‌పూలే విగ్రహాల ఏర్పాటుకు, చిత్తూరులో బీసీల భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
బీసీల రిజర్వేషన్‌లో, ఇతర కులాలను చేర్చడంలో మార్పులు తీసుకు రావాలని పలువురు బీసీ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఇందుకోసం బీసీలందరూ కలసికట్టుగా ముందుకు వచ్చి వారి కేటగిరీకి ఎలాంటి కులాలను తీసుకోవాలనే జాబితాలను తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం పరిష్కారానికి తోడ్పడతానని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాల్లో దాదాపు 90 శాతం మంది నిరుపేదలు ఉన్నారని తెలిపారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
బీసీలు ఇంతవరకు ఎంత అభివృద్ధిని సాధించాం, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధిని సాధించాలనే విషయాలపై ప్రణాళికలు సిద్ధం చే సుకోవాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బీసీలందరూ ఐక్యంగా మెలగి మానవతా స్ఫూర్తిని అలవరచుకుని జ్యోతిరావ్‌పూలే ఆశయాలను నెరవేర్చాలన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పోడాడిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావ్‌పూలే అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనియాడారు. బలమైన సామాజిక ఉద్యమకారుడైన జ్యోతిరావ్‌పూలే శతాబ్దమున్నర క్రితమే విద్యపై ఉద్యమాన్ని తీసుకువచ్చిన దార్శనికుడని ఆయన తెలియజేశారు.
అన్నింటికీ విద్యే ప్రధానమని గుర్తించి, ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించడంలో ప్రధాన భూమిక పోషించడమే కాకుండా, ఆయన సతీమణి సావిత్రీబాయి పూలేను కూడా సేవకు అంకితం చేశారన్నారు. స్త్రీలలో సమానత్వం, విద్య గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి జ్యోతిరావ్‌పూలే అని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. సావిత్రీబాయి పూలే స్త్రీ విద్య ప్రోత్సాహానికి వసతి గృహాలు ఏర్పాటు చేసిన మొదటి వనితగా ఘనతను దక్కించుకున్నారని ఆమె కొనియాడారు.
అంతకు మునుపు నగరంలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సభలో జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణీ, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కఠారి అనూరాధ, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనంజయరావు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు రాజశేఖర్‌నాయుడు, రవిప్రకాష్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రామచంద్రరాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు జ్యోతిరావ్‌పూలే - మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
Published Sun, Apr 12 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM
Advertisement
Advertisement