కల.. సాకారం
జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : ‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఆరు దశాబ్దాల కల.. సాకారమైంది. ప్రతి ఏడాది కంటే ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పది జిల్లాల ప్రజలు అత్యంత సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు’ అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తాతలు, తండ్రులు, పిల్లలు సుదీర్ఘకాలంగా చేసిన ఉద్యమాలు, ఆత్మబలిదానాల వల్ల రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న మనమంతా పునర్ని ర్మాణం కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జాతి, కుల, మత ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీ తంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో భాగస్వాములైన త్యాగమూర్తులను స్మరించుకునే పవిత్రమైన రోజన్నారు. వర్షాలు ఈ ఏడాది అశించిన విధంగా ముందుగానే కురియడంతో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయన్నారు. జిల్లా వార్షిక వర్షపాతం 993.7 మిల్లీ మీటర్లు ఉండగా... ఇప్పటికే 610మి.మీ నమోదైనట్లు తెలిపారు. ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండడంతో రైతులు సుమారు 10 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రారుుతీపై విత్తనాలు,ఎరువులు, పనిముట్లు అందించామన్నారు. ఖరీఫ్‌లో రూ.1260 కోట్లు పంట రుణాలుగా అందించాలనే లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.593 కోట్లు అందజేశామన్నారు. రైతులకు, గృహ అవసరాలకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కొత్తగా మూడు 220 కే.వీ, ఎనిమిది 132/32, ఇరవై 33/11 కే.వీ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో 2.44 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు.
త్వరలో కంతనపల్లి పనులు...
దేవాదుల ప్రాజెక్టు ద్వారా 360 రోజులు నీటిని ఎత్తిపోసేందుకు, విద్యుత్ ఉత్పాదన కోసం కంతనపల్లి ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వరంగల్, కరీంనగర్, న ల్లగొండ జిల్లాల్లో 6.21లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం ద్వారా మొదటి దశలో భాగంగా ఖరీఫ్‌లో 64, 794ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రెండు, మూడో దశల ద్వారా మరో 32,850 ఎకరాలకు నీరు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. చిన్న నీటి పారుదల విభాగం ద్వారా రూ. 65 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టి 39 వేల ఎకరాలను స్థిరీకరించామన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లాలో ఒకే చోట 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చిన ఘనత జిల్లా ప్రజాప్రతినిధులకే దక్కిందన్నారు. భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇప్పటికే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా... రెండో దశలో మరో 600 మెగావాట్ల కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని, ఇదే ప్రాంతంలో మరో 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధి
అమ్మహస్తం పథకంలో తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను కేవలం రూ.185కే అందజేస్తున్నామని, ఈ పథకం ద్వారా సుమారు 10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. మన బియ్యం పథకంలో ఇప్పటి వరకు జిల్లాలో 2.18లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామన్నారు. పుట్టిన ప్రతి ఆడపిల్లను ఆదుకునేందుకు బంగారుతల్లి పథకాన్ని చట్టం రూపంతో తీసుకొచ్చామని చెప్పారు. దీని వల్ల ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు దశల వారీగా రూ.1,55,500 అందిస్తామన్నారు. అమృత హస్తం పథకంలో గూడూరు, మరిపెడ, ఏటూరునాగారం, ములుగు ప్రాజెక్టులను ఎంపిక చేసి ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 1078 అంగన్వాడీ కేంద్రాల్లోని 13,257 మంది గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు.
పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) పథకం ద్వారా 3,355 స్వయం సహాయక సంఘాలకు రూ. 79.51 కోట్లు, పావులావడ్డీ కింద 1,816 సంఘాలకు రూ. 1.66 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద 1,885 సంఘాలకు రూ. 2.12 కోట్లు అందించామన్నారు. రాజీవ్ యువశక్తి కింద 2012-13లో 341యూనిట్లకు రూ. 1.02 కోట్లు, ఈ ఏడాది 550 యూనిట్లకు రూ. 1.52 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 15.44 కోట్లతో 3,105 యూనిట్లు స్థాపించడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లా ఆరో స్థానంలో నిలిచిందన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 21.72 కోట్లతో యూనిట్లు నెలకొల్పడం ద్వారా 4,597 మందికి లబ్ధి చేకూరిందన్నారు.
రహదారులు, తాగునీటి పథకాలు...
పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.217కోట్లతో 280 రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 73 పనులను రూ.65.82కోట్లతో పూర్తి చేసినట్లు పొన్నాల చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ.180.82 కోట్లతో తొమ్మిది ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా... రెండు పూర్తి కావడంతో 37గ్రామాలను రక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. 371పాఠశాలల్లో తాగు నీటి వసతి, 294 స్కూళ్లలో మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
వైద్యం, ఆరోగ్యం...
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 1,563 వైద్య శిబిరాలు నిర్వహించి 3.77లక్షల మంది రోగులకు పరీక్షలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 1.11 లక్షల మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు రూ.284కోట్లు వ్యయం చేశామన్నారు. గ్రామీణ ప్రజలకు 104ల ద్వారా 2.62లక్షల మందికి వైద్య సేవలు అందించామన్నారు. ఎంజీఎంలో మాతా శిశు సంరక్షణ కోసం నూతన భవనం, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు 10 పిడియాట్రిక్ వెంటిలేటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ గ్యాస్‌ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేఎంసీలో ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషదాయకమన్నారు.
విద్యాభివృద్ధికి చర్యలు
అక్షరాస్యత శాతం పెంచేందుకు విద్యా పక్షోత్సవాల నిర్వహించి బడిబయట ఉన్న 5,763 పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ. 46 కోట్లతో 773 అదనపు తరగతి గదులు, 24 ప్రాథమిక పాఠశాలలు, 221 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతిచ్చామన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల చెందిన 1.21లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు రూ.73.24కోట్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద 85,954 మంది విద్యార్థులకు రూ.81.33కోట్లు అందజేసినట్లు తెలిపారు.
ఉపాధికి పెద్ద పీట..
ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1376.63 కోట్లు వ్యయం చేసినట్లు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. మీ సేవల ద్వారా జిల్లాలో 15.29 లక్షల పత్రాలు జారీ చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లా కీర్తి, చరిత్రను నలుదిశలా వ్యాపింపజేసేలా కాకతీయ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించామన్నారు. వరంగల్ నగరాన్ని కేంద్ర పర్యాటక శాఖ ఉత్తమ వారసత్వ నగరంగా ప్రకటించడం పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న నూతన సర్పంచ్‌లు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సారయ్య, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా పాలన యంత్రాంగానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.కిషన్, రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్రావు, జారుుంట్ కలెక్టర్ ప్రద్యుమ్న, అడిషన్ జేసీ సంజీవయ్య, డీఆర్వో సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.