
బిల్లు గడువు వారం పెంచే అవకాశం: యాష్కీ
హైదరాబాద్: తెలంగాణ బిల్లులో ఎలాంటి లోపాలు లేవని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన జీవోఎంలో న్యాయ కోవిధులున్నారని గుర్తు చేశారు. మధుయాష్కీ తెలంగాణ బిల్లు ఫిబ్రవరిలో ఆమోదం పొందుతుందని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కోరిక మేరకు బిల్లు గడువును రాష్ట్రపతి మరోవారం పొడిగించే అవకాశం ఉందన్నారు.
విభజన బిల్లు తప్పుల తడక అని దాన్ని తిప్పి పంపాలంటున్న సీఎం కిరణ్ తీరు అప్రజాస్వామికమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం ఇచ్చిన విభజన బిల్లు తిరస్కార నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌ను కోరామని ఆయన తెలిపారు. బిల్లు అసమగ్రంగా ఉంది, దాన్ని తిప్పి పంపాలన్న సీఎం.. మళ్లీ బిల్లుపై చర్చకు గడువు పెంచాలనడం వితండవాదమే అవుతుందన్నారు. బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే రాష్ట్రపతి కోరారని, దానిపై ఓటింగ్ ఉండదని స్పష్టం చేశారు.