రైతులపై కేంద్రం నిర్లక్ష్యం: దేవెగౌడ
ఢిల్లీలో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహరాలు, నపుంసకత్వం కూడా కారణమన్న కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని లెఫ్ట్, జనతా పరివార్ పార్టీలు డిమాండ్ చేశాయి. కేంద్రం రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ సోమవారమిక్కడి జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు సంఘీభావం తెలిపారు.
మోదీ ప్రభుత్వం కొలువుదీరాక 6వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కర్ణాటకలో రోజూ 10 మం దికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దేవెగౌడ తెలిపారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం చర్చ చేపట్టే వరకు పార్లమెంటులో అడుగుపెట్టబోనన్నారు. రాధామోహన్ ప్రకటన అత్యంత హేయమైనదని, ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.