చిన్న పారిశ్రామికవేత్తలకూ వన్‌టైం సెటిల్మెంట్
దేశంలోని అన్ని పెద్ద, చిన్న తరహా పారిశ్రామిక సంస్థలకు కూడా వన్ టైం సెటిల్మెంట్ పాలసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అమలులో ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు లిఖిత రూపంలో ఆయన సమాధానం ఇచ్చారు. అప్పులలో కూరుకుపోయిన, నిర్వాసితులైన రైతులు, నిరుద్యోగ విద్యార్థుల విషయంలోను, పెద్దపెద్ద వ్యాపారుల విషయంలోను వ్యవహరించేటపుడు స్టేట్ బ్యాంకుకు వేర్వేరు విధానాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని, పైగా అప్పులలో కూరుకుపోయిన, నిర్వాసితులైన రైతులు, నిరుద్యోగ విద్యార్థుల విషయంలో మరింత సానుభూతితో వ్యవహరించాలన్నది స్టేట్‌బ్యాంకు బోర్డు అనుమతించిన విధానమని మంత్రి చెప్పారు.
ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు, ఇతర ప్రజలు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజల విషయంలో స్టేట్ బ్యాంకు చాలా కఠినమైన విధానం అవలంబిస్తోందని మంత్రి దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకొచ్చారు. దానికి.. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైతులు, ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజల పట్ల స్టేట్ బ్యాంకు కఠినమైన విధానాలు అవలంబించడం లేదని మంత్రి అన్నారు. అన్నిచోట్లా విధానం ఒకేలా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష ఉండబోదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో రైతులు, విద్యార్థుల పట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న కఠిన విధానాలపై సమీక్షకు తీసుకుంటున్న చర్యలేంటని కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు మరియు విద్యార్థులకు ఆర్థికసాయం / వన్ టైం సెటిల్మెంట్లకు సంబంధించి విధానం ఒకేలా ఉందని, ఈ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా జరుగుతుంటాయని ఆయన అన్నారు.