Minister sarbananda sonoval
-
బీసీసీఐ పారదర్శకంగా వ్యవహరించాలి
క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీ : దేశంలోని ఇతర క్రీడా సమాఖ్యల మాదిరిగానే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కూడా జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాల్సి ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. గతంలోనే సుప్రీం కోర్టు కూడా బీసీసీఐని ప్రజలతో సంబంధాలు కలిగిన సంస్థగా పేర్కొందని గుర్తు చేశారు. ‘చాలాకాలంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం లేదు కాబట్టి తమది ప్రైవేట్ సంస్థగా భారత క్రికెట్ బోర్డు పరిగణిస్తోంది. కానీ సుప్రీం కోర్టు చెప్పిన దాని ప్రకారం అది కూడా పబ్లిక్ బాడీ కిందికే వస్తుంది. దీంతో బీసీసీఐ రోజువారీ వ్యవహారాల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం కనిపించాలని దేశంలోని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఇది అన్ని క్రీడా సమాఖ్యలకు కూడా వర్తిస్తుంది. అందుకే బోర్డును కూడా ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని భారత ఆర్చర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సోనోవాల్ తెలిపారు. అలాగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్లకు తగిన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు
గువాహటి : దక్షిణాసియా క్రీడలను అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనే జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఈవెంట్ నవంబర్‌లో జరుగనుంది. ‘ గేమ్స్ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలని అస్సాం సీఎం కోరారు. మా తరఫు నుంచి ఈ రెండు రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఉంటుంది. భారత ఒలింపిక్ సంఘం అధికారులను ఢిల్లీకి పిలిచి ఆతిథ్యం, నిర్వహణ కమిటీల ఏర్పాటు గురించి చర్చించాల్సిందిగా క్రీడా శాఖ కార్యదర్శికి సూచించాను’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.