చిన్నారులూ... పర్యావరణాన్ని కాపాడండి
న్యూఢిల్లీ: చిన్నారులు పర్యావరణ పరిరక్షణకు చిన్నారులు పాటుపడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదే కర్ హితవు పలికారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. బాలల దినోత సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని చౌగులే పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సుఖవంతమైన జీవనవిధానం అనుకరిండంతోపాటు పర్యావరణ అనుకూలమైన అలవాట్లు చేసుకోవడంలో ఎటువంటి వైరుధ్యమూ లేదన్నారు. అవసరం లేనపుడు విద్యుత్దీపాలతోపాటు ఇతర పరికరాలను ఆపివేయడం వంటి అలవాట్లు చేసుకోవాలన్నారు. ఇందువల్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. ప్రతిరోజూ మనం ఉపయోగించే పాలు, దినపత్రికలు, వాటి ఉత్పత్తి ప్రక్రియ, అందులో భాగస్వాములయ్యే సిబ్బంది, పర్యావరణంపై వీటి ప్రభావం తదితర అంశాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. కొత్తగా నిర్మించిన పర్యావరణ్ భవన్ ఓ గ్రీన్ భిల్డింగ్ అని, అందులో అధునాతన సౌకర్యాలు ఉన్నాయని, ఇందులో ఇంధన వినియోగం అత్యంత స్వల్పంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 40 శాతం వరకూ విద్యుత్‌ను ఆదా చేస్తుందని, 55 శాతం మేర నీటిని పొదుపు చేస్తుందని తెలిపారు.