బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయబోము
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్
సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన సభాసంఘం త్వరలోనే తన నివేదికను అందజేయనుం దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ తెలిపారు. అయితే ఈ నివేదికను అడ్డుపెట్టుకొని తాము బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయబోమని స్పష్టం చేశారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీబీఎంపీ విభజనకు సంబంధించి ఎస్.ఆర్.పాటిల్ నేతృత్వంలో సభాసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విభజనపై చర్చించేందుకు ఇప్పటికే సభాసంఘం నాలుగు సార్లు సమావేశమైందని ఎస్.ఆర్.పాటిల్ వెల్లడించారు. అంతేకాక బీబీఎంపీ విభజనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు గాను అధికారుల బృందాన్ని ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాలకు సైతం పంపినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను క్రోడీకరిస్తూ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ నివేదికను అడ్డుపెట్టుకొని బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు చెప్పారు.