ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్య శిక్ష
హైదరాబాద్ : దేశ యువతను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్రూడీ వెల్లడించారు. శుక్రవారం రామంతాపూర్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ శిక్షణా సంస్థను స్థానిక ఎమ్మెల్యే ఎన్ వి వి ఎస్ ప్రభాకర్తో కలసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా వృత్తి విద్యలో పది లక్షల మంది యువతకు శిక్షణతో పాటు, ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి రుణాలు అందేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 40.20 కోట్ల మందికి నైపుణ్య అభివృద్ది శిక్షణ లక్ష్యం దిశగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుందన్నారు.