ప్రజలు ఛీత్కరించినా దొడ్డిదారిన పదవి
యనమలపై ఎమ్మెల్యే దాడిశెట్టి ధ్వజం
కాకినాడ : ప్రజలు రెండుసార్లు ఛీత్కరించినా దొడ్డి దారిన మంత్రి పదవి పొందిన చరిత్ర మంత్రి యనమల రామకృష్ణుడుదని తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడుతూ యనమల ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో రెండుసార్లు రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ప్రజామోదం లేకపోయినా మంత్రిపదవిలో సాగుతున్న యనమలకు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ప్రజామోదంతో తమ పార్టీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం కావడం తథ్యమన్నారు.
యనమల తన హయాంలో పాలనపై సమీక్షించుకోవాలని దాడిశెట్టి రాజా హితవు పలికారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం తీరు అత్యంత ఘోరంగా ఉందని విమర్శించారు. ఖాకీలు పచ్చచొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైన ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఇందుకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.