Ministry Of Coal
-
బొగ్గు కార్మికులకు కనీస పెన్షన్ ఇకపై రూ. వెయ్యి
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ.1000కి పెరిగింది. ఈ మేరకు ‘ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998’కి సవరణలను ప్రకటిస్తూ గత నెల 8న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల కార్మికులకు కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొన్ని కేటగిరీల వారీకి రూ.350 ఉంది. పెరిగిన పెన్షన్ మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ను పెంచాలని దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అసోసియేన్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్‌తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలనీ, కరువు భత్యం సైతం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
ఎన్ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్– ఎన్ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది. అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా... ► 2021–22లో ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది. ► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయితే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తాజా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్ మోనిటైజేషన్ జరగవచ్చని భావిస్తోంది. ► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు అసెట్ మానిటైజేషన్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది. ► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు. ► విద్యుత్ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. ► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది. ► మోనిటేజేషన్ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది. ► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్ ఎన్ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది. -
బొగ్గు క్షేత్రాల వేలానికి రంగం సిద్ధం..!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల తాజా వేలం ప్రక్రియకు తొలి అడుగు పడింది. వచ్చే యేడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకపక్షం, చట్ట విరుద్ధంగా పేర్కొంటూ 1993 నుంచీ జరిగిన 204 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడం తెలిసిందే. వీటిలో మొదటి విడతగా 74 క్షేత్రాలకు తాజాగా ఈ-వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుందని బొగు ్గశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ అంశంపై ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. నవంబర్ 24వ తేదీ లోపు ఈ ముసాయిదా నిబంధనలపై సంబంధిత వర్గాల స్పందనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను స్వరూప్ మీడియాకు తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్వరూప్ తెలిపారు. కేవలం సొంత అవసరాలకు వినియోగించుకునే (క్యాపిటివ్) వారికి మాత్రమే బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. నిర్దేశించిన ప్రాజెక్టు మినహా ఒక కంపెనీ సంబంధిత బొగ్గు క్షేత్రాన్ని మరే ప్రాజెక్టుకూ వినియోగించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అందుకు సంబంధించి వివరాలను అంతకుముందే తప్పనిసరిగా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. బొగ్గు క్షేత్రాల వేలం తరువాత విద్యుత్ చార్జీలు పెరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చూస్తుందని కూడా స్వరూప్ సూచనప్రాయంగా తెలిపారు. ఎన్ని క్షేత్రాలకు ఒక కంపెనీ బిడ్ దాఖలు చేయవచ్చన్న అంశంపై ఒక పరిమితి ఉంటుందని స్వరూప్ తెలిపారు. గుత్తాధిపత్యాన్ని నిరోధించడమే ఈ విధాన లక్ష్యమని వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్గా రెండు దశల టెండర్ ప్రక్రియలో బొగ్గు క్షేత్రాల ఈ-ఆక్షన్ జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వేలానికి సిద్ధం చేసే బొగ్గు గనుల గుర్తింపు, వీటిలో ప్రభుత్వ కంపెనీలకు ఏ గనులను కేటాయించాలి వంటి అంశాల నిర్ణయ బాధ్యతలను కేంద్రం నామినేటెడ్ అథారిటీకి అప్పగించనుంది. నామినేటెడ్ అథారిటీగా బొగ్గు వ్యవహారాల జాయింట్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌ను ఇప్పటికే కేంద్రం నియమించింది. విద్యుత్, స్టీల్, ఇనుము, సిమెంట్ రంగాల ప్రాజెక్టుల్లో వినియోగానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ అమలవుతుంది. పరిహారం ప్రక్రియ... తాజా ఆక్షన్‌లో ఒక బొగ్గు క్షేత్ర కేటాయింపుదారు గతంలో కూడా అదే క్షేత్రం చెందిన కేటాయింపుదారుకాని పక్షంలో, గత కేటాయింపుదారుకు పరిహారం అందుతుంది. సంబంధిత క్షేత్ర మౌలిక అభివృద్ధికి గతంలో సంబంధిత కంపెనీ వ్యయం తత్సంబంధ అంశాల ప్రాతిపదికన ఈ తరహా పరిహారాన్ని నామినేటెడ్ అథారిటీ నిర్ణయిస్తుంది. క్షేత్రాల వేలం రిజర్వ్ ధరపై అధికారులు ప్రస్తుతం మదింపు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ లోపు దీనిని నిర్ణయించే అవకాశం ఉంటుందని స్వరూప్ వెల్లడించారు. కేటాయింపులకు సంబంధించి టెక్నికల్ బిడ్స్‌ను 2015 మార్చి 3న ఓపెన్ చేయాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. మార్చి 16వ తేదీలోపు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయాలన్న సంకల్పంతో బొగ్గు మంత్రిత్వశాఖ ఉంది. తొలుత 72 కోల్ బ్లాక్‌లకు వేలం నిర్వహిస్తారు. వీటిలో 42 బ్లాకుల్లో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తిని కొనసాగించేందుకు మార్చి 31 వరకూ సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన 32 బ్లాకులు ఉత్పత్తికి సిద్ధంగా వున్నాయి. 42 ఉత్పాదక బ్లాకుల్లో ప్రస్తుతం ఏడాదికి 9 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తవుతుండగా, ఉత్పత్తికి సిద్ధంగా వున్న 32 బ్లాకులు మరో 12 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేయగల సామర్థ్యంతో వున్నాయి. ఈ గనుల్ని నిర్వహిస్తున్న ప్రస్తుత కంపెనీ ఆ బ్లాకులో చేసిన పెట్టుబడికి తగిన విలువను పొందుతుందని బొగ్గుశాఖ కార్యదర్శి వివరించారు.