కేంద్ర బొగ్గు శాఖ నోటిఫికేషన్
ఇప్పటివరకు రూ. 250/350 మాత్రమే
పెంచింది వెయ్యేనా.. అంటూ రిటైర్డ్ కార్మికుల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ.1000కి పెరిగింది. ఈ మేరకు ‘ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998’కి సవరణలను ప్రకటిస్తూ గత నెల 8న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల కార్మికులకు కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొన్ని కేటగిరీల వారీకి రూ.350 ఉంది. పెరిగిన పెన్షన్ మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ను పెంచాలని దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అసోసియేన్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి.
నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్‌తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలనీ, కరువు భత్యం సైతం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment