మైనారిటీ వైద్య సీట్ల ఫీజులు భారీగా పెంపు
♦ యాజమాన్య సీట్లకు నెల దాటకుండానే రెండోసారి సవరణ
♦ బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 9 లక్షల నుంచి రూ. 11 లక్షలు.. సీ కేటగిరీ ఫీజు రూ. 11 లక్షల నుంచి రూ. 13.25 లక్షలకు పెంపు
♦ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ యాజమాన్య వైద్య సీట్ల ఫీజును భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సరిగ్గా గత నెల 20 న ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు నెల రోజులు గడవకుండానే మళ్లీ పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల మైనారిటీ వైద్య యాజమాన్య కోటాలోని బీ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు ఫీజులు పెంచింది. ఆ ఫీజును ఇప్పుడు రూ. 11 లక్షలకు పెంచింది. అలాగే సీ కేటగిరీ సీట్ల ఫీజును గత నెల రూ. 11 లక్షలకు సవరించి ఇప్పుడు ఏకంగా రూ. 13.25 లక్షలకు పెంచింది. అలాగే, సీట్ల కేటగిరీల్లో తాజాగా మార్పులు చేసింది. మైనారిటీ వైద్య కళాశాలల్లో గతంలో 60 శాతం సీట్లు ఏ కేటగిరీలో ఉండేవి. వాటిని ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారానే కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు.
అయితే గత నెల విడుదల చేసిన ఉత్తర్వుల్లో అందులోని 10 శాతం సీట్లను యాజమాన్య కోటాలోకి చేర్చారు. దీంతో కన్వీనర్ కోటా సీట్లు 50 శాతానికి తగ్గాయి. తాజా ఉత్తర్వుల్లో మళ్లీ పాత పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ 10 శాతం సీట్లను తిరిగి కన్వీనర్ కోటాలోకి మార్పు చేశారు. దీంతో తిరిగి కన్వీనర్ కోటా సీట్లు 60 శాతానికి చేరినట్లయింది. ఇది పేద విద్యార్థులకు కాస్తంత ఊరటనిచ్చే అంశమే. కానీ, ఈ కళాశాలల్లో సీట్లన్నింటినీ మైనారిటీ విద్యార్థులతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. వారి ద్వారా భర్తీ కాకుంటే ఇతరులతో భర్తీ చేసుకోవచ్చు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫీజు అంశాలకు సంబంధించి కొన్ని సవరణలు కోరారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
ఇక నుంచి మూడు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు...
యాజమాన్య కోటా సీట్లకు ఇక నుంచి మూడు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ఒకటి కాగా... నాన్ మైనారిటీ కళాశాలల్లోని యాజమాన్య సీట్లకు మరో పరీక్షకు సర్కారు ఈ ఏడాది అనుమతించింది. ఆ ప్రకారం వాటికి ఈ ఏడాది ప్రత్యేక పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
ఇక వచ్చే ఏడాది నుంచి మైనారిటీ వైద్య కళాశాలలు కూడా సొంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మైనారిటీలోని 25 శాతం సీట్లకు మాత్రమే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం సాధారణ ఎంసెట్ పరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేస్తారు.