బంగారు మీరా...
అంచనాలు నిజమయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజే భారత్ బంగారు బోణీ చేసింది. మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో ‘రికార్డు’ ప్రదర్శనతో అదరగొట్టింది. గ్లాస్గో గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న ఆమె ఈసారి ప్రపంచ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత శిబిరంలో ఆనందాన్ని నింపింది. అంతకుముందు పురుషుల 56 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ గురురాజా రజత పతకం నెగ్గి భారత్‌కు ఈ గేమ్స్‌లో తొలి పతకాన్ని అందించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తానికి మొదటి రోజే భారత్ రెండు పతకాలతో తన వేటను మొదలుపెట్టింది.
గోల్డ్‌కోస్ట్: క్రితంసారి కంటే ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంతో కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగిన భారత క్రీడాకారులు శుభారంభం ఇచ్చారు. తొలి రోజే ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. తనపై పెట్టుకున్న ఆశలను, అంచనాలను నిజంచేస్తూ మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచింది. ఆమె మొత్తం (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్–170 కేజీలు) రజతం నెగ్గగా... దినుషా గోమ్స్ (శ్రీలంక–155 కేజీలు) కాంస్యం సాధించింది. పసిడి గెలిచే క్రమంలో మీరాబాయి ఆరు (మూడు కామన్వెల్త్ చాంపియన్‌షిప్, మూడు కామన్వెల్త్ గేమ్స్) కొత్త రికార్డులు సృష్టించడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్... అదే జోరును గోల్డ్‌కోస్ట్‌లోనూ కనబరిచింది. ముందుగా స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మీరాబాయి వరుసగా 80, 84, 86 కేజీలు... అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో వరుసగా 103, 107, 110 కేజీలు ఎత్తింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, మొత్తం కేటగిరీలలో మీరాబాయి కామన్వెల్త్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు తన పేరిటే ఉన్న కామన్వెల్త్ రికార్డు (స్నాచ్‌లో 85 కేజీలు; క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు; మొత్తం 194 కేజీలు)ను మీరాబాయి సవరించింది. అంతేకాకుండా 2010లో అగస్టీనా నవకోలో (స్నాచ్‌లో 77 కేజీలు; క్లీన్ అండ్ జెర్క్‌లో 98 కేజీలు; మొత్తంలో 175 కేజీలు) నెలకొల్పిన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును మీరాబాయి తాజా ప్రదర్శనతో తెరమరుగు చేసింది.
చివరి ప్రయత్నంలో...: అంతకుముందు పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249కేజీలు (స్నాచ్‌లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చు కున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైన ఈ కర్ణాటక లిఫ్టర్ మూడో ప్రయత్నంలో సఫలమై పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా – 261కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక–248కేజీలు) కాం స్యం గెలిచారు.పురుషుల 62కేజీల విభాగంలో భారత లిఫ్టర్ రాజా ముత్తుపాండి (266కేజీలు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇతర క్రీడాంశాల్లో భారత ప్రదర్శన...
►బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ లీగ్ పోటీల్లోభారత జట్టు వరుసగా 5–0తో శ్రీలంక, పాకిస్తాన్‌లపై నెగ్గింది.
►బాక్సింగ్: పురుషుల 69కేజీల విభాగం తొలి రౌండ్లో మనోజ్ కుమార్ 5–0తో ఒసిటా ఉమె (నైజీరియా)పై గెలుపొందాడు.
►జిమ్నాస్టిక్స్: పురుషుల రింగ్స్ విభాగంలో రాకేశ్, ఆల్ అరౌండ్ విభాగంలో యోగేశ్వర్ ఫైనల్స్‌కు చేరారు.
►టేబుల్ టెన్నిస్: టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు 3–0తో ట్రినిడాడ్ అండ్ టొబాగోపై, 3–0తో నార్తర్న్ ఐర్లాండ్‌పై గెలుపొందింది. భారత మహిళల జట్టు 3–0తో శ్రీలంకను, 3–1తో వేల్స్‌ను ఓడించింది.
► స్క్వాష్: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ 2–3తో క్రిస్టోఫర్ బెన్నీ (జమైకా) చేతిలో ఓడిపోయాడు. హరీందర్ పాల్ సింగ్, విక్రమ్, దీపిక పళ్లికల్, జోష్న చినప్ప ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
►స్విమ్మింగ్: వీర్‌ధవల్ ఖడే(50 మీటర్ల బటర్‌ఫ్లయ్) సెమీస్‌లో; శ్రీహరి నటరాజన్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్) సెమీస్‌లో; సాజన్ ప్రకాశ్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో నిష్క్రమించారు.
►బాస్కెట్‌బాల్: లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 57 – 66తో జమైకా చేతిలో... పురుషుల జట్టు 87 – 96తో కామెరూన్ చేతిలో ఓడాయి.
►మహిళల హాకీ: తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో వేల్స్ చేతిలో ఓడింది.
తొలి స్వర్ణం బెర్ముడా ఖాతాలో...
గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన ఘనత బెర్ముడా దేశానికి చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ ఖాతాలోకి వెళ్లింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. తొలి రోజు పోటీలు ముగిశాక ఇంగ్లండ్ (6 స్వర్ణాలు+3 రజతాలు+3 కాంస్యాలు) 12 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. రెండు పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది.
స్వర్ణ పతకం నెగ్గిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. రికార్డులు బద్దలు కొడతానని అనుకోలేదు. ఇన్నాళ్లుగా నేను పడ్డ కష్టానికి పసిడి పతకం రూపంలో ఫలితం లభించింది. రియో ఒలింపిక్స్‌లో విఫలమైన తర్వాత తీవ్రంగా నిరాశ చెందాను. తాజా ప్రదర్శనతో చాలా ఆనందంగా ఉన్నాను. నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడల్లో పతకం నెగ్గడం.
–మీరాబాయి చాను