ప్రియురాలిని చంపి ఉప్పు పాతరేశాడు!
శంషాబాద్, చైతన్యపురి, హుడా కాంప్లెక్స్: గుడికి వచ్చిన యువతితో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
గుడిలో ఏర్పడిన పరిచయం కాస్తా ..
చెన్నైకి చెందిన కురుగంటి అరుణ, శ్రీకర్ దంపతుల కుమార్తె అప్సర (30) అక్కడే సినీ రంగంలో పని చేశారు. ఓ చిత్రంలో పాత్ర కూడా పోషించారు. తండ్రి కాశీకి వెళ్లిపోవడంతో కూతురును తీసుకొని తల్లి హైదరాబాద్‌కు వలస వచ్చింది. వీళ్లు సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీ రోడ్ నం.15 లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్వతహాగా భక్తురాలైన అప్సర తరచూ తన ఇంటికి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజారి, రియల్టర్ అయిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణతో గతేడాది ఏప్రిల్‌లో పరిచయమైంది. ఇరువురిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ పాపకు తండ్రి కూడా అయిన సాయికృష్ణ తరచు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆమెను తీసుకుని తన ద్విచక్ర వాహనం, కార్లలో గోశాలలు, దేవాలయాలకు వెళ్తుండేవాడు. ఎలాంటి సందేహం రాని అరుణ వారికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.
వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో...
సాయికృష్ణతో సన్నిహితంగా మెలుగుతున్న అప్సర గతంలో పలుమార్లు తనను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరింది. అతడు దాటవేస్తుండటంతో ఈ ఏడాది మార్చి నుంచి ఒత్తిడి పెంచింది. దీంతో ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికొచ్చిన సాయికృష్ణ.. ఈ నెల 3వ తేదీ రాత్రి 8.15 గంటల ప్రాంతంలో తన కారులో (ఫోర్డ్ ఫిగో, టీఎస్ 07హెచ్‌జే 2172) అప్సర ఇంటికి వెళ్లాడు. కోయంబత్తూరు వెళ్దామని చెప్పి బయటకు తీసుకొచ్చాడు. 11 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలో భోజనం చేశారు. తర్వాత కాస్త అస్వస్థతకు గురైన అప్సర కారు ముందు సీట్లో నిద్రకు ఉపక్రమించింది. సాయికృష్ణ అక్కడినుంచి సుల్తాన్పూర్ గోశాల వైపు కారు తీసుకెళ్లాడు.
కారు బాడీ కవర్‌తో చంపేందుకు విఫలయత్నం...
తెల్లవారుజామున 3.50 గంటలకు అప్సర నిద్రలో ఉండగా.. కారు బాడీ కవర్ బయటకు తీసిన సాయికృష్ణ వెనుక సీటులోకి వచ్చాడు. అక్కడ నుంచే బాడీ కవర్‌ను ఆమె మెడకు చుట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ అప్సర ప్రతిఘటించడంతో వెనుక సీటు కింద ముందే ఉంచిన బెల్లం కొట్టే రాయి తీసి దాదాపు పదిసార్లు కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని అదే కవర్లో చుట్టిన సాయికృష్ణ కారు డిక్కీలో పెట్టి మరుసటి రోజు (ఈ నెల 4న) తెల్లవారుజామున 4:45 గంటలకు సరూర్‌నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుని కారును మృతదేహంతో పాటే పార్కింగ్‌లో ఉంచాడు.
ఉదయం అరుణ ఇంటికి వెళ్లిన సాయికృష్ణ అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు. తర్వాత అప్సర ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి, ఈ నెల 5వ తేదీన అరుణతో కలిసి ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్సరను తన మేనకోడలిగా పేర్కొన్నాడు. భద్రాచలం వెళ్తానని చెప్పడంతో తన కారులోనే శంషాబాద్ వరకు తీసుకువచ్చి అక్కడి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె ఫ్రెండ్స్ కారులో ఎక్కించానని, మరుసటి రోజు నుంచి ఆమె ఫో¯న్ స్విచ్చాఫ్ వస్తోందని తెలిపాడు.
మృతదేహం నుంచి వాసన వస్తుండటంతో...
అప్సర మృతదేహం 5వ తేదీ సాయంత్రం వరకు సాయికృష్ణ కారులోనే ఉంది. దుర్వాసన వస్తున్నట్టు గమనించిన అతను రాత్రి వేళ కారు తీసుకుని సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో కుక్కి పడేసి, దాదాపు 2 బస్తాల ఉప్పు దానిపై పోశాడు. నిత్యాన్నదానం చేస్తున్న ఇతను దానికి వా డే ఉప్పునే దీనికీ ఉపయోగించాడు. మరుసటి రో జు తెల్లవారుజామున 2 టిప్పర్ల ఎర్రమట్టి తెప్పించి సెప్టిక్ ట్యాంక్‌లో పోయించాడు. ఆమె హ్యాండ్ బ్యా గ్, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. ఇంటికి వెళ్లి కారును శుభ్రం చేసి దాచిపెట్టాడు. ఈ నెల 7న మరోసారి అక్కడకు వెళ్లిన సాయికృష్ణ సెప్టిక్ ట్యాంక్‌కు ఉన్న రెండు మ్యాన్‌హోల్స్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఎల్బీనగర్ లోని లేబర్ అడ్డాకు వెళ్లి కొత్త మ్యాన్‌హోల్ మూతలు తెచ్చాడు. వీటిని మ్యాన్‌హోల్స్‌పై ఉంచి కాంక్రీట్ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ స్థలాన్ని బాగు చేయించాడు. ఇదంతా సామాజిక సేవలో భాగమనే భావన స్థానికులకు కల్పించాడు.
సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో..
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు అప్సర ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలు, అప్సర, సాయికృష్ణ ఫోన్ల టవర్ లొకేషన్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలో సాయికృష్ణ కారులోనే అప్సర షాబాద్ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను పగులగొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న అప్సర మృతదేహాన్ని బయటకు తీశారు.
సాయికృష్ణను అరెస్టు చేసి కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం ప్రకటించారు. హత్య జరిగిన ప్రాంతం శంషాబాద్ గ్రామీణ పోలీసుస్టేషన్పరిధిలోకి వస్తుంది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఆ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నారు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయికృష్ణ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలిసింది. అప్సర గతంలోనూ గర్భం దాల్చిందని, దీంతో తనను పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పినట్లు తెలిసింది. తన వల్లే అప్సర గర్భం దాల్చలేదని, ఆమెకు ఇతరులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఆమెకు తానే అబార్షన్ చేయించానని చెప్పాడని తెలుస్తోంది.
మా అబ్బాయి మంచివాడు
మా అబ్బాయి సాయికృష్ణ చాలా మంచివాడు. దైవసేవ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అప్సర చనువుగా ఉండటం గమనించి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పాం. మా అబ్బాయే హత్య చేశాడని అనుకోవటం లేదు.
– నిందితుడి తండ్రి లక్ష్మినర్సింహమూర్తి
సాయికృష్ణను ఉరితీయాలి
అక్కయ్యా అని పిలుస్తూ మా ఇంటికి వచ్చేవాడు. అభం శుభం తెలియని నా బిడ్డకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. చివరకు పొట్టన పెట్టుకున్నాడు. వాడిని బహిరంగంగా ఉరి తీయాలి.
– అప్సర తల్లి అరుణ
ఇంత కర్కోటకుడు అనుకోలేదు
సాయికృష్ణ గత పదేళ్లుగా సరూర్‌నగర్ పరిసరాల్లోని ఆలయాల్లోనే పని చేస్తున్నాడు. అందరికీ సుపరిచితుడు. నమ్మకంగా ఉండటంతో ఆలయం ప్రధాన పూజారిగా నియమించాం. కానీ ఇంత కర్కోటకుడు అనుకోలేదు.
– ఆకుల అరవింద్‌కుమార్, ట్రస్టీ, బంగారు మైసమ్మ దేవాలయం