గుంతకల్లు టౌన్: ఆస్తి కోసం కన్నతల్లినే దారుణంగా హత్య చేయించింది ఓ కసాయి కూ తు రు. కనిపించకుం డా పోయిన తల్లి కోసం చిన్న కూతురు ఫిర్యాదు చేయడం తో నెలన్నర తరువాత మిస్సింగ్ మిస్టరీ వీడింది.
రూరల్ సీఐ గురునాథబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని భాగ్యనగర్ యస్‌జెపి స్కూల్ సమీపంలో సుశీలమ్మ(65) తన సొంతింట్లో నివాసముండేది. ఈమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒక కుమారుడు చనిపోగా, మరో కుమారుడు 20 యేళ్లక్రితం తప్పిపోయాడు. పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. భర్తను కోల్పోయిన రెండో కుమార్తె లక్ష్మి తల్లి వద్దనే ఉంటోంది.
తల్లికున్న ఆస్తిని, బంగారాన్ని కాజేయాలని కుట్రపన్నిన లక్ష్మి ఇంట్లో అద్దెకుంటున్న బోడిసానిపల్లికి చెందిన అల్లిస్వామితో తల్లి హత్యకు పథకం రచించింది. అల్లిస్వామి చిప్పగిరి మండలం గుమ్మనూర్‌కి చెందిన మంజునాథ్, తిమ్మయ్యకు పథకాన్ని వివరించి రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 15న 20 యేళ్ల క్రితం తప్పిపోయిన సుశీలమ్మ పెద్దకుమారుడు బళ్లారిలో ఉన్నాడని సుశీలమ్మను నమ్మించారు. దీంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన సుశీలమ్మ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది ఆమెను ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లారు. గుమ్మనూర్ గ్రామ శివార్లలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె తనను వదిలేయాలని ప్రాధేయపడింది. అయినా కనికరం చూపని కర్కశకులు ఆమె తలపై బండరాయితో మోది హత్య చేసి ఓ గుంత తవ్వి శవాన్ని పాతిపెట్టారు. తల్లి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురైన చివరి కూతురు సుజాత బంధువులను విచారించింది.
అయినా ఎక్కడా తన తల్లి ఆచూకీ లభించకపోవడంతో జూన్ 12న వన్‌టౌన్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. వృద్ధురాలు అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఏమీ తెలియనట్టు నటిస్తున్న కూతురు లక్ష్మి, ఆ ఇంట్లో అద్దెకుండి మూడు రోజులకే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిన అల్లిస్వామిపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు గుట్టు బయటపడింది.
చివరకు సుశీలమ్మను కిరాయి హంతకులతో హత్యచేయించినట్లు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ గురునాథబాబూ పేర్కొన్నారు. వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబూ, సిబ్బందితో శనివారం నిందితులను వెంటబెట్టుకుని గుమ్మనూర్‌కి వెళ్లి గ్రామ శివార్లోని ముళ్లపొదల్లో పూడ్చిపెట్టిన సుశీలమ్మ మృతదేహాన్ని చిప్పగిరి తహశీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీయించి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించినట్లు ఆయన తెలియజేశారు. శ్యాంపిల్స్‌ను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లిని హత్య చేయించిన తనయ
Published Sun, Jul 12 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement