ఏం కష్టమొచ్చిందో! | what the problem came! | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చిందో!

Published Wed, Jul 23 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

ఏం కష్టమొచ్చిందో!

ఏం కష్టమొచ్చిందో!

 రాయచోటిటౌన్: వారికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వారి దాంపత్య జీవ నం అన్యోన్యంగా సాగుతోంది. కానీ ఏం కష్టమొచ్చిందో తెలియదు. విషం తీసుకుని నిండుప్రాణాలు తీసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని అనాథను చేసి వెళ్లిపోయారు.
  స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాయుడి కాలనీకి చెందిన ఎం. కోటయ్య నాయక్, సునీతలకు ముగ్గరు కుమార్తెలు (ఝాన్సీ, శ్రీవాణి, శిరీషా), కుమారుడు అంజి గోపాల్‌నాయక్ (27).
 
 వారి స్వగ్రామం సుండుపల్లె మండలం ఫించా సమీపంలోని కటారుమడుగు. వీరు సుమారు 15 ఏళ్లు క్రితం బ్రదుకుతెరువు కోసం రాయచోటికి వచ్చారు. ఇక్కడే ఉంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అంజిగోపాల్ నాయక్‌కు సంబేపల్లె మండలం బిడికీకి చెందిన కాంతమ్మ, శేఖర్‌నాయక్‌ల కుమార్తె రజని(23)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అంజిగోపాల్ నాయక్ సుమారు పదేళ్లుగా ఆటోను నడుపుకొంటూ జీవనం సాగించే వాడు.
 
 ఈ మధ్య కాలంలో సకాలంలో ఆటో ఫైనాన్స్ బకాయిలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లారు. దీంతో కోటయ్య కుమారుడికి ఒక ఎద్దుల బండి కొనిచ్చాడు. దీనినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తూ ఎస్‌ఎన్ కాలనీ లోని చెక్ పోస్టు వద్ద కాపురం ఉండేవాడు. కోటయ్య మాత్రం రాయుడి కాలనీలోనే ఉండేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం తన భార్య బిడ్డతో కలసి తండ్రి ఉన్న ఇంటిలోకే గోపాల్‌నాయక్ మకాం మార్చాడు. అందరూ కలిసే ఉంటున్నారు.
 
 అయితే గత నాలుగు రోజులుగా కుమారుడు మౌనంగా ఉంటుండటాన్ని గమనించిన తండ్రి ఆరా తీశాడు. అయినా కొడుకు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కోటయ్య భార్య తన కుమార్తెతో కలిసి తిరుపతికి వెళ్లింది. ఇదే సమయంలో తండ్రి కూలిపనికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వీరు వీరు తమ పక్కింటి వాళ్ల సెల్‌ఫోన్ మళ్లీ ఇస్తామని తీసుకెళ్లారు. ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ ఎంతకు ఫోన్ ఇవ్వక పోవడంతో తమ ఫోన్ కోసం పక్కింటి మహిళ వెళ్లింది. అమ్మానాన్నల మధ్య వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి ఏడుపులు వినిపించాయి. తన ఫోన్ ఇవ్వాలని కోరగా  అంజిగోపాల్ నాయక్ తన 6నెలల కుమార్తెను తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి పరిస్థితి గమనించి వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా మార్గ మధ్యంలోనే భార్య మృతి చెందగా అంజి గోపాల్ నాయక్ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement