ఆ ఇంటి కూతుళ్లు ముగ్గురూ డాక్టర్లే!
కూతురంటే గుండెమీద కుంపటి కాదు.. కూతురంటే కొండంత అండ. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు కూతుళ్లుంటే..! అది కూడా ముగ్గురూ డాక్టర్లయితే.. ఇంకేం కావాలా తండ్రికి? తాజాగా విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. పటాన్చెరుకు చెందిన మందముల నివార్తిదేవ్ కుమార్తె ఎం.చరిష్మా 390 ర్యాంకు సాధించింది.
శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన చరిష్మా... స్థానిక కార్పొరేటర్ సపాన్‌దేవ్ సోదరుడి కుమార్తె. నివార్తిదేవ్‌కు ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు షాలిని గాంధీలో హౌస్ సర్జన్‌గా చేస్తున్నారు. రెండో అమ్మాయి శ్రవంతి గాంధీలోనే ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. మూడో కుమార్తె చరిష్మా. తాజాగా ఈమె కూడా మెడిసిన్‌లో చేరబోతోంది. అంటే ఈ ఇంట్లో ముగ్గురూ డాక్టర్లేనన్నమాట.
నివార్తిదేవ్ పటాన్‌చెరు ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 'ఒక కూతురన్నా డాక్టరైతే బాగుండనుకున్నా. కానీ... ముగ్గురూ అదే రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పీజీ చేయిస్తా. మిగిలింది కుమారుడు సాయికౌశిక్... సివిల్స్ సాధించాలని కోరుకుంటున్నాం' అన్నారు నివార్తిదేవ్. 'ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అక్కలే స్ఫూర్తి, అమ్మానాన్నల ఆశీస్సులతో ఈ ఘనత సాధించా. గైనకాలజిస్టునయ్యి నిస్వార్థ సేవ చేయాలని కోరుకుంటున్నా. అందుకు అహర్నిశలూ శ్రమిస్తా' అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది చరిష్మా.