రన్‌వేపై త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం
ఒక ఇండిగో విమానం గాల్లోకి లేస్తోంది.. అప్పుడే మరో ఎయిరిండియా విమానం రన్‌వే మీదకు దిగుతోంది. సరిగ్గా ఆ రెండూ ఒకదాన్ని ఒకటి దాదాపు ఢీకొట్టుకోబోయాయి. అంతే.. రెండింటిలో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులు గుండెలు అరచేతిలో పట్టుకుని ప్రాణాలు ఉగ్గబట్టుకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని బగ్డోరాలో జరిగింది. రెండు విమానాలకూ ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎయిరిండియా విమానంలో 120 మంది ప్రయాణికులున్నారు. అది రన్‌వే మీదకు దిగుతోంది. ఇండిగో విమానం బగ్డోరా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోబోతోంది అందులో 130 మందిప్రయాణికులున్నారు. రెండు విమానాల మధ్య కనీసం కిలోమీటరు దూరం ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా ఈ రెండూ చాలా సమీపానికి వచ్చేశాయి. అయితే, రెండు విమానాల పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
ముందుగా ఇండిగో విమాన కెప్టెన్‌కు ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ నుంచి హెచ్చరిక వచ్చింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం కెప్టెన్ వెంటనే విమానాన్ని కిందకు దించేశాడు. ఎయిరిండియా విమానం కూడా అలాగే కుడివైపు తిరిగిపోయింది. ఇద్దరు కెప్టెన్లకు 'క్లియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్' సందేశం రాగానే వాళ్లు మళ్లీ విమానాలను మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది.