మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు.
అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్‌ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్‌సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్‌తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్‌సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు.