హైదరాబాద్ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో నేటితో అయిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబరు 28న మియాపూర్ – నాగోల్ (30 కి.మీ) మార్గంలో జెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నగర మెట్రో ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ ఎన్నో సవాళ్లు.. నష్టాలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత అయిదేళ్లుగా మెట్రో అధిగమించిన మైలురాళ్లను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే..
►ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో నగరంలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. మొత్తం మూడు రూట్లలో 57 స్టేషన్లున్నాయి.
►ఈ ఏడాది అక్టోబర్ 3న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా దేశంలోనే మొదటిసారిగా మెట్రో రైల్ సేవల్లో సమగ్రమైన డిజిటల్ చెల్లింపు ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సేవలను వాట్సాప్ ఈ –టికెటింగ్ సదుపాయంతో ప్రారంభించింది.
►ఇదే సంవత్సరం జూన్ 15న ప్యాసిజర్ ఎంగేజ్మెంట్, సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ వినూత్నమైన మెట్రో బజార్ కాన్సెప్ట్ , షాపింగ్ ఆన్ ద గో నేపథ్యంతో వచ్చింది. మెట్రో ప్రయాణికులకు అనుభవపూర్వక షాపింగ్ అవకాశాలను ఇది అందించింది.
►ఇదే ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ మెట్రో రైల్‌కు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది, దీని ద్వారా మెట్రో రైళ్లను పూర్తి వేగంతో నడపవచ్చు. రైళ్ల వేగం గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కేఎంపీహెచ్ పెరిగింది. దీంతో పలు కారిడార్లలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది.
► మార్చి 31న సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు విడుదల చేసింది. దీంతో అపరిమితంగా నగరంలోని 57 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లలో తిరిగే అవకాశం లభిస్తుంది. ఇది సంవత్సరంలో 100 సెలవు దినాలలో అందుబాటులో ఉంటుంది.
► 2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ మెట్రో రైల్ ఓ రోగిని బతికించడం కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగి కోసం హెచ్ఎంఆర్ 21 కిలోమీటర్ల ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా నాగోల్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ల మధ్య నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రోగి ప్రాణాలను కాపాడింది.
► ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుని కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గిస్తుంది. మెట్రో రైల్ 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ ప్లాంట్లను బహిరంగ ప్రదేశాలలో, మెట్రో రైల్ డిపోల వద్ద, రూప్టాఫ్ల మీద 28 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసింది. ఈ సోలార్ సామర్థ్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ తమ విద్యుత్ అవసరాలలో 15 శాతం తీర్చుకుంటోంది.
► మెట్రో రైళ్ల వినూత్నమైన రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్ధల ద్వారా సుమారు 40 శాతం విద్యుత్‌ను పునర్వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణికులకు బంపర్ ఆఫర్..
నిత్యం మెట్రో రైళ్లలో స్మార్ట్ కార్డ్‌లతో జర్నీ చేసే వారికి లాయల్టీ బోనస్ అందించేందుకు మెట్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కేవలం ఎంపిక చేసిన సిరీస్ నంబర్లున్న వినియోగదారులకే ఈ బోనస్ అందుతుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్‌పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నాయి.