మెట్రోకు సమాంతరంగా కొత్త ఫ్లైఓవర్లు
* మియాపూర్-ఎల్‌బీనగర్ మార్గంలో ఎనిమిది చోట్ల నిర్మాణం
* జాతీయ రహదారుల విభాగానికి రూ.300 కోట్లు చెల్లించనున్న హెచ్‌ఎంఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మెట్రో కారిడార్‌లో కొత్తగా ఫ్లైఓవర్లు రూపుదిద్దుకోనున్నాయి. అసలే ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతున్న ప్రజలు మెట్రో రైలు మార్గం నిర్మాణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆయా మార్గాల్లో అవసరమైన చోట రైల్వే కారిడార్లకు సమాంతరంగా ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ప్రధాన కారిడార్ అయిన మియాపూర్-ఎల్‌బీనగర్ మార్గంలో 8 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని మెట్రో రైలు ప్రాజె క్టు సంస్థ నిర్ణయించింది. బుధవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ.300 కోట్లను జాతీయ రహదారుల విభాగానికి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు సంస్థ వెంటనే చెల్లించాలని సూచించారు.
పనులు ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో జాతీయ రహదారులు, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, ట్రాఫిక్ పోలీసు విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ నెల 26న పర్యటించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇం జనీర్ గణపతిరెడ్డి, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.