సార్.. కొడుకు సాకడం లేదు
ఎమ్మెల్యే ఎదుట ప్రభుత్వ ఉద్యోగి తండ్రి ఆవేదన
హసన్పర్తి : ‘ఎమ్మెల్యే సార్.. నా కొడుకుకు సర్కార్ నౌకరి ఉంది. పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకు మాత్రం తిండి పెట్టడం లేదు’ అంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎదుట చింతగట్టుకు చెందిన మూల రాములు అనే వ్యక్తి సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. డెంగీ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే చింతగట్టుకు వచ్చారు. ‘ఎమ్మెల్యే గారూ.. నాకు పింఛన్ ఇప్పించండి. కొడుకుకు నౌకరు ఉందని నాకొచ్చే పింఛన్ తీసేశారని ప్రాధేయపడ్డాడు. సర్కారే ధిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశాడు’. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు పింఛన్లు ఇవొద్దని ఉత్తర్వులు ఉన్నాయి.
ఓ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తల్లిదండ్రులు పోషించని వారిని ఎవరితో పోల్చాలని అడిగారు. కాగా, అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని గణపురం, చిట్యాల మండలాల్లో పలు గ్రామాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంపీడీ ఓ కార్యాలయాల ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. పరకాల మండలం వరికోల్లో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పింఛన్లు మంజూరైన వారు కూడా తీసుకోకుండా అధికారులను వెనక్కి పంపించారు. అలాగే రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం లో పంచాయతీ కార్యదర్శిని నిర్బంధించారు.