రూ.కోట్లు వెచ్చించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
► సత్యసాయి నీటి కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ట్యాంకులు నిరుపయోగం
► 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎన్పీకుంట వాసులు
ఎన్పీకుంట : మండలంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించి సత్యసాయి మంచినీటి పథకం రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. దాహార్తి నివారణతో పాటు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. రక్షిత మంచినీరు గ్రామీణులకు అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించడానికి 1998లో రూ.7.33 కోట్ల వ్యయంతో ఎన్పీకుంట, గాండ్లపెంట, కదిరి రూరల్ మండలాలతో కలిపి 105 గ్రామాలకు సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు అందించడానికి అప్పటి ఎమ్మెల్యే జొన్నా సూర్యనారాయణ పథకాన్ని ప్రారంభించారు.
కదిరి నుంచి ఎన్పీకుంట వరకు పైప్లైన్ ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఫ్లోరైడ్ రహిత నీటిని అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే పథకం ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మండల ప్రజలకు సత్యసాయి నీరు అందడంలేదు. ప్రతి ఏటా వేసవిలో గ్రామాల్లో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలల్లో మాత్రం త్వరలోనే సత్యసాయి నీటి సరఫరా కోసం సర్వే చేస్తున్నామని ప్రజా ప్రతినిధులకు అధికారులు భరోసా ఇచ్చారే కానీ ఇంతవరకు పనులు జరగలేదు.
ఏర్పాటు చేసిన పైపులూ చోరీకి గురి..
నీటి సరఫరా సంగతి పక్కన బెడితే, పలుచోట్ల పైప్లైన్ ఏర్పాటు చేయగా, వాటిలో కొన్నిచోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. వాటి స్థానంలో కొత్త పైపులు అమర్చలేదు. సత్యసాయి నీటి కోసం గ్రామాల్లో నిర్మించిన మంచినీటి ట్యాంకులు సైతం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మండలంలోని వెలిచెలమల, వడ్డిపల్లి, పడమర నడిమిపల్లి, గౌకనపేట, తాటిమానుగుంత, బందారుచెట్లపల్లి, దిగువపల్లి, ఎన్.పీకుంట, టీఎన్పల్లి, జౌకల, మండెంవారిపల్లి, మర్రికొమ్మదిన్నె తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉందని గుర్తించిన అధికారులు ఫిల్టర్ నీటిని అందించడానికి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు.
అన్ని గ్రామాలకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తాం
అన్ని గ్రామాలకు నీటిని అందించాలంటే సంపు సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. అంతేకాకుండా పైప్లైన్లో సైతం సక్రమంగా నీటిని పంపు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశ్యంతో సర్వే చేస్తున్నాం. అందుకు ఈ ఎడాది రూ,1.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి.
- ఉమామహేశ్వరి. (ఆర్డబ్యుఎస్జెఈ)