యలమంచిలి ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
పాడేరు : యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాడేరు పోలీసులు నిన్న ఎనిమిదిమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గతంలో పాడేరులో పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు బాలసూర్యారావు, వెంకట అప్పారావు, ఎస్ఐలు శోభన్ బాబు, శంకరరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, సెరీకల్చర్ ఉద్యోగులు ధనలక్ష్మి, రత్నకుమారిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పాడేరుకు చెందిన సామాజిక కార్యకర్త అల్లాడి శ్రీనివాసరావుకు రెండేళ్ల కిందట కన్నబాబు ఫోన్లో బెదిరించారనే ఆరోపణలపై పాడేరు నాయ్యస్థానంలో ప్రయివేటు కేసు నమోదు అయ్యింది. దీనిపై అప్పట్లో పనిచేసిన వీరంతా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అల్లాడి పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి చర్యలకు పాడేరు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.