ఎమ్మెల్యే పంకజ్‌ను ప్రశ్నించనున్న సిట్
ముంబై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర పీడబ్యూడీ మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కేసు విషయమై ఆయన కుమారుడు ఎన్సీపీ ఎమ్మెల్యే పంకజ్ ముఖర్జీని సిట్ ఈ వారం ప్రశ్నించనుంది. రెండు మూడు రోజుల పాటూ విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్లు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఆదివారం తెలిపింది. ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులతో కూడిన సిట్ భుజ్‌బల్ బంధువు, మాజీ ఎంపీ సమీర్‌ను గత శుక్రవారం సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించింది.
కాగా, ఈ వారం కూడా సమీర్‌ను సిట్ ప్రశ్నించనుంది. అయితే సమీర్, పంకజ్‌లను ఎప్పడు ప్రశ్నిస్తామనే విషయం మాత్రం సిట్ తెలపలేదు. విచారణకు సంబంధించిన వివరాలను ప్రత్యేక బృందం ఈ నెల 28న బాంబే హైకోర్టుకు సమర్పించనున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీలో నిర్మించిన కొత్త మహారాష్ట్ర సదన్ భవనం, మహారాష్ట్రలో నిర్మించిన రెండు ఇతర భవనాల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం భుజ్‌బల్‌పై బహిరంగ విచారణను ఏసీబీకి అప్పగించింది. గతంలో భుజ్‌బల్ పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ భవనం, మలబార్ హిల్‌లో రాష్ట్ర అతిథి గృహం, సుబుర్బన్లో కొత్త పరిపాలనా భవనం, ప్రాంతీయ రవాణా కార్యాలయం నిర్మాణాన్ని ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించింది.
అయితే ఆ కాంట్రాక్టును మంత్రి భుజ్‌బల్ ఏమాత్రం అనుభవం లేని తన సన్నిహితునికి అప్పగించారని, నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచార ని ఆరోపణలొచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేత కిరిట్ సోమయ్య ఏసీబీని ఆశ్రయించారు. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణకు అంగీకారం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ హైకోర్టులో వేసిన పిల్‌పై కోర్టు సిట్ ఏర్పాటు చేసింది. భుజ్‌బల్, అతని కుమారుడు పంకజ్, బంధువు సమీర్‌లకు కాంట్రాక్టు విషయంలో ముడుపులు అందాయని ఆప్ ఆరోపించింది.