నెల పండుగ ప్రారంభం
మొదలైన నూకాంబిక కొత్త అమావాస్య జాతర
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పీలా
ఆలయ పరిసరాల్లో సందడి
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక కొత్త అమావాస్య జాతర గురువారం రాత్రి ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఈ నెల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం కొత్త అమావాస్య పండుగ నిర్వహించి సాయంత్రం 5.00 గంటలకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తారు.ఉగాదిని పురస్కరించుకొని శనివారం మళ్లీ దర్శనభాగ్యం కల్పిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జాతరను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ర్ట ప్రభుత్వం తరపున తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా పీలా దంపతులను ఆలయంలోకి మేళతాళాలతో ఆహ్వానించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత, భక్త జనమండలి చైర్మన్ బి.ఎస్.ఎం.కె. జోగినాయుడులు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, పండగ ప్రత్యేకాధికారి ఎన్.వి.మూర్తి ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిబ్బంది, డీఎస్పీ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పీలా మహాలక్ష్మినాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పీలా శ్రీనివాసరావు, అవంతి మహేష్, గుత్తా ప్రభాకర్ చౌదరి, బుద్ధ నాగజగదీష్, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సత్యవతి, కశింకోట ఎంపీపీ సుబ్బలక్ష్మి, మలసాల కుమార్, కాయల మురళి పాల్గొన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను పంపారని తెలిపారు. నెలరోజుల పండగకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆలయ పరిసరాలలో అదనంగా మూడెకరాలను సమీకరించి మరింత అభివృద్ధి పనులు చేపడతామన్నారు.