mla sravankumar
-
సచివాలయ పనులు పరిశీలించిన సీఎం
హెలికాప్టర్లో చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడి వచ్చారు. వెలగపూడిలో ఆరుబ్లాకులుగా చేపట్టిన తాత్కాలిక సచివాలయం పనుల పురోగతిపై మంత్రులు, అధికారులతో ఆరా తీశారు. తొలుత హెలికాప్టర్లో మూడు పర్యాయాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన చంద్రబాబు.. పైనుంచి (ఎరియల్ వ్యూ) పనులను పరిశీలించారు. అనంతరం నిర్మాణ ప్రాంతంలో కాలినడక కలియతిరిగారు. ఈ సందర్భంగా తాత్కాలిక సచివాలయ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఏర్పాటు చేసిన ఎత్తయిన వేదిక నుంచి పనులు జరుగుతున్న తీరును గమనించారు. నిర్మాణ నమూనా మ్యాప్‌ను పరిశీలించారు. సైట్ ఇన్‌చార్జ్‌లు చంద్రశేఖర్‌రెడ్డి, హరినారాయణలు సీఎంకు పనుల వివరాలు తెలిపారు. అనంతరం సమీపంలోని మల్కాపురం పురాతన శివాలయం, నంది విగ్రహం, బౌద్ధస్థూపం (శిలాశాసనం) పరిశీలించారు. గ్రామ సర్పంచ్ బూక్యా పార్వతితో మాట్లాడి పురాతన చరిత్ర కలిగిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, రావెల, దేవినేని ఉమ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఎస్పీ నాయక్ ఉన్నారు. -
ఆగడాలపై ఆగ్రహం
సాక్షి, గుంటూరు : ‘ఎమ్మెల్యే గారూ.. మన పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి.. ఇసుక ధరలు ఆకాశాన్నంటాయి.. మన పార్టీ నేతలే ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలకు దిగుతున్నట్లు చెబుతున్నారు.. దీన్ని అరికట్టే బాధ్యత మీకు లేదా..?’ అంటూ తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను గ్రామస్తులు నిలదీశారు. రాజధాని ప్రాంతంలో మొదటగా రుణమాఫీ చేయిస్తానని, రేషన్ కార్డులు, ఫింఛన్లు ఇప్పిస్తానని హామీలైతే ఇచ్చారు.. ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదు.. అంటూ సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేశారు. వివ రాలివి.. మందడం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించేందుకు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం తుళ్ళూరు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వెళ్లారు. టీడీపీలోని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.వెయ్యి ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3,500 పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందాకు పాల్పడే నేతలెవరో తేల్చి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యేపై గొడవకు దిగారు. మాఫీ ఊసే లేదు.. రాజధాని గ్రామాల్లో రైతులకు రుణమాఫీ జరిగేలా చూస్తామని, భూమిలేని నిరుపేదలకు ఫింఛన్లు ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని, ఇంత వరకూ అతీగతీ లేవని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఒక్కో గ్రామంలో వెయ్యి మంది భూమి లేని నిరుపేదలు ఉండగా రెండు, మూడు వందల మందికి ఫింఛన్లు ఇచ్చి అంతా ఇచ్చామని చెప్పుకోవడం ఏమిటంటూ నిలదీశారు. రెండు, మూడు రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ చెప్పి నెల దాటుతున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఏ విషయం తేల్చే వరకూ వినాయక విగ్రహాల వద్దకు వెళ్లనీయమంటూ ధ్వజమెత్తారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యేని నిలదీస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను నెట్టివేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారిని జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు నివాసానికి పిలిపించుకుని సర్ధిచెప్పే ప్రయత్నాలు చేశారు. టీడీపీకి బలం ఉన్న తుళ్ళూరు మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుండటంపై ఆపార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారు. -
రైతులతో ప్రభుత్వం దోబూచులాట
తాడికొండ : రాజధాని నిర్మాణానికి నయానో భయానో 33,347 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న ప్రభుత్వం వారితో దోబూచులాడుతోంది. కౌలు చెల్లింపుపై తాత్సారం చేస్తోంది. జనవరి 1 నుంచి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణ చేట్టిన ప్రభుత్వం నేటికీ ఏ భూములు ఏ విభాగానికి చెందినవన్న స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచలేదు. భూములు సమీకరణకు ఇచ్చిన రైతులు పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. అసలేం జరిగిందంటే... 1916-20 మధ్య రాజధాని ప్రాంతంలోని నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, కృష్ణాయిపాలెం, వెంకటపాలెం, మండదం గ్రామాల్లోని మాజీ సైనికులకు, పేదలకు 1400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరిలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఇతరులకు విక్రయించుకోగా, మిగిలిన వారు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగళ్లు పొంది సాగు చేసుకుంటున్నారు. భూసమీకరణను ప్రకటించటంతో వీరంతా 9.3 అంగీకార పత్రాలు ఇచ్చారు. వీరిలో కొందరికి ప్రభుత్వం కౌలు డీడీలు కూడా పంపిణీ చేసింది. అసైన్డ్, అటవీ భూముల్ని తీసుకుంటే కౌలు పరిహారం తగ్గుతుందని రైతులకు చెప్పకుండా గోప్యంగా ఉంచింది. అంతకు ముందు ఇచ్చిన డీడీలు ఇచ్చి వేయాలంటూ ఈనెల 2,3 తేదీల్లో పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు పెట్టింది. అయితే, అసలు 6 తేదీ భూమి పూజకు ఎక్కడ వ్యతిరేకత వస్తోందని కొందరు టీడీపీ నేతలు బోర్డులో ఉన్న పత్రాల్ని తొలగించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కౌలు పరిహారం అందకుంటే సేద్యానికి వెళతాం.. తమకు కౌలు పరిహారం అందించకుంటే తప్పకుండా సేద్యానికి వెళతామని మంగళవారం మందడంలో నిర్వహించిన రైతు సమావేశంలో రైతులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు విన్నవించారు. తమకు సాగు లేక కౌలు పరిహారం లేకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించారు. ఈ సమస్యను 2011 జనవరిలో మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన చంద్రబాబుతో చెప్పగా.. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రస్తుతం ఇలా చేయటం సరికాదని నీరుకొండ గ్రామానికి చెందిన రైతు నరేంద్ర సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే కౌలు పరిహారం చెల్లించాలని, లేదంటే తమ భూములు సేద్యం చేసుకుంటామని హెచ్చిరించారు.