
సచివాలయ పనులు పరిశీలించిన సీఎం
హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి వచ్చారు. వెలగపూడిలో ఆరుబ్లాకులుగా చేపట్టిన తాత్కాలిక సచివాలయం పనుల పురోగతిపై మంత్రులు, అధికారులతో ఆరా తీశారు. తొలుత హెలికాప్టర్‌లో మూడు పర్యాయాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన చంద్రబాబు.. పైనుంచి (ఎరియల్ వ్యూ) పనులను పరిశీలించారు. అనంతరం నిర్మాణ ప్రాంతంలో కాలినడక కలియతిరిగారు.
ఈ సందర్భంగా తాత్కాలిక సచివాలయ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఏర్పాటు చేసిన ఎత్తయిన వేదిక నుంచి పనులు జరుగుతున్న తీరును గమనించారు. నిర్మాణ నమూనా మ్యాప్‌ను పరిశీలించారు. సైట్ ఇన్‌చార్జ్‌లు చంద్రశేఖర్‌రెడ్డి, హరినారాయణలు సీఎంకు పనుల వివరాలు తెలిపారు. అనంతరం సమీపంలోని మల్కాపురం పురాతన శివాలయం, నంది విగ్రహం, బౌద్ధస్థూపం (శిలాశాసనం) పరిశీలించారు. గ్రామ సర్పంచ్ బూక్యా పార్వతితో మాట్లాడి పురాతన చరిత్ర కలిగిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, రావెల, దేవినేని ఉమ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఎస్పీ నాయక్ ఉన్నారు.