
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీతో పాటు ఎల్లో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు, కాన్వాయ్‌కి ట్రాఫిక్ ఆపడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట. ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడ్కొని వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్‌గారు మీతో పాటు నడిచి ఆయనను అభినందించారు. మీకూ ఆయనకు తేడా అదే!.
బాలయ్య భలే డైలాగ్...
‘తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజలకు బంట్రోతులని బాలయ్య భలే డైలాగ్ చెప్పాడు. మహిళా తాసిల్దారును ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే బంట్రోతే, ఆశా చెల్లెళ్లను బూతులు తిట్టిన వ్యక్తీ సేవకుడే. ప్రజలను హింసించి వందల కోట్ల కే ట్యాక్స్ వసూలు చేసిన వారు స్పీకర్‌గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా!. అలాగే పిల్లల మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా చూసే బాధ్యతను ఇస్కాన్ నడిపే అక్షయపాత్రకు జగన్ అప్పగించారు. పచ్చ మీడియా మాత్రం 2017లోనే చంద్రబాబు బిడ్లు ఆహ్వానించి ‘గుడ్డు’ విషయంలో రద్దు చేశారని కవరింగ్ ఇస్తోంది. అక్షయపాత్రకు ఇస్తే తమ దోపిడీ నిలిచిపోతుందనే దూరం పెట్టారు.’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా చంద్రబాబు నాయుడును నిన‍్న గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి అవమానించారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment