ఎన్టీఆర్, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రధాని మోదీ రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక.. తిరిగి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు.
రేపు ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో..ఆ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొననున్నారు. ఒడిషాలో దాదాపు పాతికేళ్లకు అధికారం చేతులు మారగా.. బీజేపీ ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
వీఐపీల రాక..
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేటి నుంచే ప్రముఖులు నగరానికి రానున్నారు.
ఏర్పాట్లు పూర్తి
చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణం రూపొందించారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండగా, 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. వీవీఐపీ లు,వీఐపీ లతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల్ని ఆ గ్యాలరీలకు ఇంఛార్జిలుగా నియమించారు. దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
భారీ భద్రత
ప్రధాని మోదీ సహా ఇతర వీవీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సుమారు 7 వేల మందిని నియమించింది రాష్ట్ర పోలీస్ శాఖ. అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ చెన్నై - కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించనున్నారు.
ఇదీ చదవండి: Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే
Comments
Please login to add a commentAdd a comment