సాక్షి, గుంటూరు : ‘ఎమ్మెల్యే గారూ.. మన పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి.. ఇసుక ధరలు ఆకాశాన్నంటాయి.. మన పార్టీ నేతలే ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలకు దిగుతున్నట్లు చెబుతున్నారు.. దీన్ని అరికట్టే బాధ్యత మీకు లేదా..?’ అంటూ తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను గ్రామస్తులు నిలదీశారు. రాజధాని ప్రాంతంలో మొదటగా రుణమాఫీ చేయిస్తానని, రేషన్ కార్డులు, ఫింఛన్‌లు ఇప్పిస్తానని హామీలైతే ఇచ్చారు.. ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదు.. అంటూ సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివ రాలివి.. మందడం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించేందుకు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం తుళ్ళూరు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వెళ్లారు. టీడీపీలోని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి దందాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.వెయ్యి ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3,500 పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందాకు పాల్పడే నేతలెవరో తేల్చి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యేపై గొడవకు దిగారు.
మాఫీ ఊసే లేదు.. రాజధాని గ్రామాల్లో రైతులకు రుణమాఫీ జరిగేలా చూస్తామని, భూమిలేని నిరుపేదలకు ఫింఛన్‌లు ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని, ఇంత వరకూ అతీగతీ లేవని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఒక్కో గ్రామంలో వెయ్యి మంది భూమి లేని నిరుపేదలు ఉండగా రెండు, మూడు వందల మందికి ఫింఛన్‌లు ఇచ్చి అంతా ఇచ్చామని చెప్పుకోవడం ఏమిటంటూ నిలదీశారు. రెండు, మూడు రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ చెప్పి నెల దాటుతున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు.
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఏ విషయం తేల్చే వరకూ వినాయక విగ్రహాల వద్దకు వెళ్లనీయమంటూ ధ్వజమెత్తారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యేని నిలదీస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను నెట్టివేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారిని జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు నివాసానికి పిలిపించుకుని సర్ధిచెప్పే ప్రయత్నాలు చేశారు. టీడీపీకి బలం ఉన్న తుళ్ళూరు మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుండటంపై ఆపార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారు.
ఆగడాలపై ఆగ్రహం
Published Mon, Sep 21 2015 1:40 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement