నైతిక విలువలకు పట్టం
♦ పదవులకు రాజీనామా చేస్తేనే వైఎస్సార్సీపీలోకి ప్రవేశం
♦ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
♦ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, అమరావతి: నైతిక విలువలు, నీతిమంతమైన రాజకీయాలకు అద్దంపట్టే అరుదైన సంఘటన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆవిష్కృతమైంది. డబ్బు సంచులు, పదవులు, కాంట్రాక్టులను ఎరవేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవులు సైతం కట్టబెడుతున్న తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు రోత పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఘటన రాష్ట్ర, దేశ ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది. తమ పార్టీలోకి ఇతర పార్టీల వారెవరైనా రావాలనుకుంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులన్నింటినీ వదులుకొని రావాల్సిందేనని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు.
ఈ మేరకు టీడీపీ గుర్తుపై తాను సాధించిన శాసనమండలి (కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానం) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఆ మేరకు శాసన మండలి చైర్మన్‌ను ఉద్దేశిస్తూ నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామా లేఖపై సంతకం చేసి, బహిరంగ సభ వేదికపై, ప్రజల సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయాలని కోరారు.
ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బులు, పదవులు ఆశచూపి చంద్రబాబు టీడీపీలో చేర్చుకొంటున్నారని, అలాంటి నీచ రాజకీయాలకు వైఎస్సార్సీపీ ఏనాడూ పాల్పడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు అక్కడి పదవులను వదులుకొంటేనే తమ పార్టీలోకి ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. అటు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన సంగతి తెలిసిందే.