MLC vakati Narayana Reddy
-
ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బుధవారం బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సీబీఐ అధికారులతో పాటు బ్యాంకు అధికారులూ సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు గతేడాది జనవరి 21న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెంగళూరు జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలుచేయగా.. బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు సీబీఐ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నెల్లూరుకు చేరుకున్నారు. వాకాటి పీఏ రామకృష్ణకు ఫోన్ చేయగా.. తాను తిరుపతిలో ఉన్నానని చెప్పడంతో అధికారులు ఇద్దరు బ్యాంకు ప్రతినిధులను వెంటబెట్టుకుని వాకాటి గృహానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటì.. వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలు నిర్వహిస్తున్నారు. 2014లో హైదరాబాద్ షామీర్పేటలోని రూ.12 కోట్ల విలువైన భవనానికి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువ పెంచి రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ)కు దరఖాస్తు చేసుకోగా.. రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో వాకాటి ఆస్తుల జప్తుపై ఫైనాన్స్ కార్పొరేషన్ దృష్టి సారించిన క్రమంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. దీంతో 2017 మే 5న కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 మే 12న నెల్లూరు నగరంతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించి 99 కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
అలక వీడని ఆదాల
నెల్లూరు(సెంట్రల్) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం చివర వరకు ప్రయత్నించి నిరాశ చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంకా అలక వీడలేదు. గత కొన్ని రోజుల నుంచి తనకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబును కోరుతూ వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ఎంత ప్రయత్నించినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికే సీటు కేటాయించారు. వాకాటికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆదాల అలకబూనారు. సోమవారం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మంత్రులు ఆదాల నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం జరిగిన వాకాటి నామినేషన్ ప్రక్రియలో ఆదాల మాత్రం తన అలకను వీడనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉదయాన్నే నామినేషన్ వేసేందుకు టీడీపీ జిల్లా కార్యాలయానికి నాయకులు విచ్చేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో ఆదాల తాను నామినేషన్‌కు రానంటూ మొండి కేశారు. ఈ విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు తెలియడంతో రవిచంద్ర కూడా వాకాటి వద్దకు వెళ్లి ఆదాలను ఏ విధంగానైనా తీసుకురావాలని సూచించారు. దీంతో వాకాటి నారాయణరెడ్డి ఆదాల వద్దకు వెళ్లి నామి నేషన్‌కు రావాలని పట్టుబట్టారు. అయితే ఆదాల ససేమిరా అంటూ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశారు. బయటకు వెళ్లిపోతున్న ఆదాలను వాకాటి నారాయణరెడ్డి చేతులు పట్టుకుని అతికష్టం మీద కారులో ఎక్కించుకుని నామినేషన్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సంఘ టనను చూసిన నాయకులు, కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. ఆదాల ప్రభా కర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో వాకాటికి సపోర్టు చేస్తారా అనే అనుమానం నాయకుల్లో మొదలైంది. అదేవిధంగా ఆదాల వర్గానికి చెందిన నాయకులు కూడా నామినేషన్ కార్యక్రమానికి రావడానికి సుముఖత చూపలేదు. మొత్తం వ్యవహారం చూస్తుంటే ఆదాల తన అలకను మానుకునేట్టులేడని చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఆదాల ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి నెగ్గేది కష్టమేనని చర్చించుకున్నారు.