నెల్లూరు(సెంట్రల్) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం చివర వరకు ప్రయత్నించి నిరాశ చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంకా అలక వీడలేదు. గత కొన్ని రోజుల నుంచి తనకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబును కోరుతూ వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ఎంత ప్రయత్నించినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికే సీటు కేటాయించారు. వాకాటికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆదాల అలకబూనారు. సోమవారం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మంత్రులు ఆదాల నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం జరిగిన వాకాటి నామినేషన్ ప్రక్రియలో ఆదాల మాత్రం తన అలకను వీడనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉదయాన్నే నామినేషన్ వేసేందుకు టీడీపీ జిల్లా కార్యాలయానికి నాయకులు విచ్చేశారు.
పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో ఆదాల తాను నామినేషన్‌కు రానంటూ మొండి కేశారు. ఈ విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు తెలియడంతో రవిచంద్ర కూడా వాకాటి వద్దకు వెళ్లి ఆదాలను ఏ విధంగానైనా తీసుకురావాలని సూచించారు. దీంతో వాకాటి నారాయణరెడ్డి ఆదాల వద్దకు వెళ్లి నామి నేషన్‌కు రావాలని పట్టుబట్టారు. అయితే ఆదాల ససేమిరా అంటూ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశారు. బయటకు వెళ్లిపోతున్న ఆదాలను వాకాటి నారాయణరెడ్డి చేతులు పట్టుకుని అతికష్టం మీద కారులో ఎక్కించుకుని నామినేషన్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఈ సంఘ టనను చూసిన నాయకులు, కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. ఆదాల ప్రభా కర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో వాకాటికి సపోర్టు చేస్తారా అనే అనుమానం నాయకుల్లో మొదలైంది. అదేవిధంగా ఆదాల వర్గానికి చెందిన నాయకులు కూడా నామినేషన్ కార్యక్రమానికి రావడానికి సుముఖత చూపలేదు. మొత్తం వ్యవహారం చూస్తుంటే ఆదాల తన అలకను మానుకునేట్టులేడని చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఆదాల ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి నెగ్గేది కష్టమేనని చర్చించుకున్నారు.
అలక వీడని ఆదాల
Published Wed, Mar 1 2017 11:47 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement