mobile medical vehicle
-
సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్: 539 కొత్త 104 వాహనాలు
సాక్షి, అమరావతి: గ్రామీణ, మూరుమూల ప్రాంతాల ప్రజలకు వారి ముంగిటే నాణ్యమైన వైద్య సేవలు రానున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు 539 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మిగతా వాహనాల కొనుగోళ్లకు చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున మొత్తం 656 కొత్త వాహనాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రజలకు అక్కడే వైద్య సేవలందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేయడం ద్వారా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలానికి రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 మొబైల్ మెడికల్ యూనిట్వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మండలానికి రెండు చొప్పున 104 వాహనాలను సమకూర్చేందుకు కొత్తగా మరో 539 కొనుగోలు చేస్తున్నారు. టెండర్లలో ఎల్–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న ధరకు మళ్లీ రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో సాధకబాధకాలను తెలుసుకుని పటిష్టంగా ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 258 మండలాల్లో నవంబర్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 1,195 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. జనాభాను దృష్టిలో పెట్టుకుని.. జనాభాను దృష్టిలో పెట్టుకుని 104 వాహనాలను వినియోగించాలంటూ సీఎం ఆదేశించారని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో వినయ్‌చంద్ తెలిపారు. 539 కొత్త వాహనాల కొనుగోలుకు సుమారు రూ.89 కోట్లు వ్యయం అవుతుందన్నారు. వాటి నిర్వహణకు ఏడాదికి రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికి నెలకు కనీసం రెండుసార్లు 104 వాహనంలో వైద్యులు వెళ్లి ఉదయం ఓపీ చూస్తారన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారని వివరించారు. కొత్త 104 వాహనాలు జవనరి 26 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
మధుమేహాన్ని అదుపుచేస్తున్నారు..
సాక్షి, అమరావతి: జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ రోగులను గుర్తించడంతో పాటు వారికి ఉచితంగా మందులు అందిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నీరుగార్చిన 104 మొబైల్ మెడికిల్ క్లినిక్ వ్యవస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ఊపిరి పోశారు. గ్రామాలకు పంపి అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించేలా తీర్చిదిద్దారు. మండలానికి ఒకటి చొప్పున 104 మొబైల్ క్లినిక్‌ను కేటాయించారు. వీటి ద్వారా నిరంతరం ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ పేషెంట్లను గుర్తించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు వీరికి పరీక్షలు నిర్వహించి, మందులిచ్చేందుకు ప్రత్యేకంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. 74 రకాల మందులు ఉచితంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,28,592 మంది మధుమేహ పేషెంట్లను గుర్తించారు. వీరికి నిత్యం మందులు అందిస్తూ ఇతర జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, మలేరియా, టీబీ, లెప్రసీ నివారణ, బీపీ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ.. తదితర 20 రకాల వైద్య సేవలందిస్తున్నారు. ఈసీజీతో సహా 9 రకాల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన 74 రకాల మందులను ఉచితంగా 104ల ద్వారానే అందిస్తున్నారు. రోజుకు ఓ గ్రామ సచివాలయంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం 9,853 గ్రామ సచివాలయాల పరిధిలో 656 మొబైల్ మెడికల్ క్లినిక్‌లు పనిచేస్తున్నాయి. జీవన శైలి జబ్బుల నుంచి విముక్తి ప్రాథమిక దశలోనే జీవన శైలి జబ్బులను గుర్తించి వైద్యం అందించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెంచొచ్చు. పేదలకు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. – డాక్టర్ గీతాప్రసాదిని, సంచాలకులు, ప్రజారోగ్యశాఖ -
తుపాను బాధితులకు అపోలో వైద్యసేవలు
అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి వెల్లడి విశాఖపట్నం: తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎంత మేరకైనా సాయమందించడానికి అపోలో ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ కె.సంగీతారెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడి అపోలో మెయిన్ ఆస్పత్రి ఆవరణలో బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, సంచార వైద్య వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుపాను బాధితుల సహాయార్థం విరాళం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్‌ను కలిశానని, అయితే వారు విరాళం కంటే విలువైన వైద్య సేవలను బాధితులకు అందించాలని కోరారని తెలిపారు. దీంతో అపోలో ఆస్పత్రి విశాఖ జిల్లాలోని భీమిలి, పెదజాలరిపేట, ఆరిలోవ హెల్త్‌సిటీ, రాంనగర్ అపోలో ఆస్పత్రి ఆవరణ లో దీపావళి వరకూ వైద్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులను ఆదుకునేందుకు మూడు సంచార వైద్య బృందాలను సోమవారం నుంచి పంపనున్నామని తెలిపారు. రూ.5 లక్షల విలువైన మందులను కూడా సిద్ధం చేశామన్నారు.