తుపాను బాధితులకు అపోలో వైద్యసేవలు
అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి వెల్లడి
విశాఖపట్నం: తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎంత మేరకైనా సాయమందించడానికి అపోలో ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ కె.సంగీతారెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడి అపోలో మెయిన్ ఆస్పత్రి ఆవరణలో బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, సంచార వైద్య వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుపాను బాధితుల సహాయార్థం విరాళం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్‌ను కలిశానని, అయితే వారు విరాళం కంటే విలువైన వైద్య సేవలను బాధితులకు అందించాలని కోరారని తెలిపారు.
దీంతో అపోలో ఆస్పత్రి విశాఖ జిల్లాలోని భీమిలి, పెదజాలరిపేట, ఆరిలోవ హెల్త్‌సిటీ, రాంనగర్ అపోలో ఆస్పత్రి ఆవరణ లో దీపావళి వరకూ వైద్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులను ఆదుకునేందుకు మూడు సంచార వైద్య బృందాలను సోమవారం నుంచి పంపనున్నామని తెలిపారు. రూ.5 లక్షల విలువైన మందులను కూడా సిద్ధం చేశామన్నారు.