ఫ్యాబ్‌సిటీలో ‘మొబైల్ హబ్’
సెల్‌ఫోన్ విడిభాగాల తయారీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్ మైక్రోమ్యాక్స్ సంస్థకు 50 ఎకరాలు కేటాయింపురూ.200 కోట్లతో ఆ సంస్థ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకొత్తగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పలు సంస్థలు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సెల్‌ఫోన్ విడిభాగాల తయారీకి మహేశ్వరం మండలం రావిరాల సమీపంలోని ఫ్యాబ్‌సిటీ కేంద్రంగా మారనుంది. ఈ ప్రాంతంలో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూముల్లో సెల్యులార్ పరిశ్రమల స్థాపనకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ మైక్రోమ్యాక్స్ సంస్థ 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ ఏర్పాట్లు వేగిరం చేసింది.
దీంతో గురువారం రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత పలు కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.
రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
రావిరాలలో ఏర్పాటు చేసే ‘మొబైల్ ఫోన్ తయారీ హబ్’తో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఈ నెల మొదటివారంలో ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ప్రతి నిధుల బృందం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ సంస్థ ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. సామ్సంగ్ కంపెనీ సై తం యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది.
అదేవిధంగా తైవాన్‌కు చెందిన మరో కంపెనీ ప్రతినిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయ్యారు. ఇలా పలు సంస్థలు ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు సానుకూలత చూపుతుండడంతో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు అధికారవరా్గాలు చెబుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానంలో కంపెనీలకు భారీ రాయితీలివ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా పేర్కొంది. మొత్తంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది.