కిరణ్ నయా గిరీశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ఆషాఢభూతిలాగా, ఓ మోడ్రన్ గిరీశం మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై సీఎం మాట్లాడిన తీరు చూస్తే.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆడిస్తున్న పెద్ద డ్రామాలో కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాష్ట్రాన్ని విభజించే విషయం సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడే వరకూ తనకు తెలియనట్లు, విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఆయనకు ఇప్పుడే తెలిసివచ్చినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కొణతాల విమర్శించారు. ఈ వ్యవహారమంతా చూస్తోంటే కాంగ్రెస్‌లోనే సోనియా, కిరణ్ జట్లుగా విడిపోయి వాళ్లలో వారే క్రికెట్ ఆడుతున్నారన్నది అర్థమవుతోందని విమర్శించారు. అసలైన మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఇదేనని పేర్కొన్నారు.
విభజన నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారనీ, కానీ తనకు తెలియదన్నట్లుగా కిరణ్ నటించడం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. రోడ్‌మ్యాప్‌లు ఇచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి వచ్చి ఇప్పుడు నష్టపోతామని కిరణ్ మాట్లాడ్డం విడ్డూరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలే ముఖ్యమని కిరణ్ ఓవైపు చెబుతూనే.. మరోవైపు సోనియా వల్లే సీఎం అయ్యానంటూ విధేయత చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘మీరు ఆడుతున్న క్రికెట్లో ప్రజలను బంతులను చేయొద్దు’’ అని హితవు చెప్పారు. జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నపుడే విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు రాజీనామాలు చేసి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి ప్రక్రియ ఆగిపోయి ఉండేదని కొణతాల పేర్కొన్నారు. సీఎం తీరు చూస్తోంటే ఇల్లు కాలిపోతోంటే ‘అయ్యో.. అయ్యో అంటూనే, బొగ్గులు ఏరుకున్నట్లు’గా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘ప్రజలెవరూ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు. 2009 డిసెంబర్ 9న తొలిసారి రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పుడు రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు కూడా జూలై 30 తరువాత అదే రీతిలో అందరూ రాజీనామాలు చేసి ఉంటే నిర్ణయం వెనక్కి పోయేది. అప్పుడు ఇలా సమ్మెలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని రామకృష్ణ పేర్కొన్నారు.
ప్యాకేజీని ఆపింది మీరు కాదా..?
‘‘శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడానికి 2011లో కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనపుడు.. ఆ సమయంలో అలాంటివి వద్దంటూ ఆపింది ఎవరు? మీరు కాదా కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ! అప్పట్లో మీరు ప్యాకేజీని ఆపకుండా ఉంటే ఇపుడు ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు కదా.. మీ మంత్రివర్గ సహచరులే ఈ మాటలు అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కూడా మీ వల్లనే ప్యాకేజీ రాకుండా పోయిందన్నారు’’ అని కొణతాల పేర్కొన్నారు. ‘‘2009 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రోశయ్య కమిటీని వేసి ‘విభజన’ చేయాల్సి వస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. ఆ కమిటీకి 9 అంశాలను కూడా ఇచ్చారు. మీరు సీఎం అయ్యాక ఆ అంశాలపై ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు? తెలంగాణ కోసం వందలాది మంది మృతి చెందినపుడైనా ఎందుకు స్పందించలేదు? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై పార్లమెంటులో గానీ, అసెంబ్లీలో గాని చర్చ తీసుకురావాలని ఎందుకు ప్రయత్నించలేక పోయారు?’’ అని సీఎంను రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఇవేమీ చేయకుండా రాజకీయ లబ్ధి పొందడానికి ఇప్పుడు సోనియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని దిగ్విజయ్‌సింగ్ చెప్పడాన్ని కొణతాల తప్పు పట్టారు. ‘‘శిక్ష పడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించేయాలని రాహుల్ అనలేదా? అదే మాదిరి విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని కూడా చించేయాలి’’ అన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేబినెట్ నోట్ రావడానికి ముందే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి పంపి రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాజీనామాలకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అయితే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాక అందరూ రాజీనామాలు చేయాలని ఆయన సూచించారు.